ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సెలబ్రిటీలు ఆందోళనకు గురవుతున్నారు. తమ వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బచ్చన్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్లింది. గూగుల్ కంపెనీపై దావా వేసింది. యూట్యూబ్ లాంటి వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌కు అనుమతి లేకుండానే తమ స్వరాన్ని, ఇమేజ్‌లను వాడుతున్నట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అభిషేక్ బచ్చన్, ఆయన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్(Aishwarya Rai Bachchan) .. గూగుల్ కంపెనీపై సుమారు నాలుగున్నర లక్షల డాలర్ల నష్టపరిహారం కేసు దాఖలు చేశారు. మేథో సంపత్తి హక్కులను దుర్వినియోగం చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోలు క్రియేట్ చేస్తున్నారని ఆ జంట ఆరోపించింది. అలాంటి వీడియోలను తొలగించాలని జడ్జీని కోరారు. డీప్‌ఫేక్ వీడియోలతో ఇతర ఏఐ మోడల్స్‌ను కూడా కలుషితం చేస్తున్నట్లు తమ పేపర్స్‌లో పేర్కొన్నారు. సెప్టెంబర్ ఆరో తేదీన అభిషేక్, ఐశ్వర్య.. కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. అయితే జనవరి 15వ తేదీన జరిగే తదుపరి విచారణ లోపే స్పందన ఇవ్వాలని గూగుల్ లాయర్‌కు హైకోర్టు ఆదేశించింది. యూట్యూబ్ అనేది కొత్త రకమైన టీవీ అని భారత్‌లోని యూట్యూబ్ మేనేజింగ్ డైరెక్టర్ గుంజన్ సోని ఇటీవల పేర్కొన్నారు. యూట్యూబ్‌కు ఇండియాలో 60 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌కు ఇక్కడే మార్కెట్ ఎక్కువగా ఉన్నది. ఎంటర్టైన్మెంట్ కాంటెంట్‌లో ఆ ప్లాట్‌ఫామ్ ఇక్కడ చాలా పాపులర్. అయితే యూట్యూబ్ వీడియోలు చాలా షాకింగ్‌గా ఉన్నాయని పిటీషన్లో బచ్చన్ ఫ్యామిలీ పేర్కొనడం గమనార్హం.
గూగుల్‌పై వేసిన దావా సుమారు 1500 పేజీలు ఉన్నది. గూగుల్‌తో పాటు ఇతరుల నుంచి దాదాపు నాలుగున్నర లక్షల డాలర్ల నష్టపరిహారాన్ని బచ్చన్ ఫ్యామిలీ డిమాండ్ చేస్తున్నది. భవిష్యత్తులో పర్సనల్ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఇంజంక్షన్ ఆదేశాలు ఇవ్వాలని కోరింది. వందల సంఖ్యలో వెబ్ లింకులు, స్క్రీన్షాట్లను బచ్చన్ జంట తమ అఫిడవిట్లో పొందుపరిచింది. లైంగికంగా జుగుప్సాకరమైన రీతిలో ఊహాజనితంగా ఉన్న ఏఐ కాంటెంట్ కూడా వాటిల్లో ఉన్నది. 518 వెబ్ లింకులను, పోస్టులను తొలగించాలని సెప్టెంబర్ తీర్పులో కోర్టు ఆదేశించింది.