ఉట్నూర్ : జిల్లాలో నేరాల అదుపునకు పోలీస్ యంత్రాంగం వినూత్న చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రజలు ఎక్కువగా ప్రయాణించే ఆటోలు, జీపులు తదితర వాహనాల వల్ల అభద్రతభావానికి లోను కాకుండా ఇబ్బందుల రాకుండా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan ) గురువారం ఉట్నూర్ సబ్ డివిజన్ పరిధిలో అభయ మై టాక్సీ ఇస్ సేఫ్ ( Abhaya My Taxi is Safe ) అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉట్నూర్ సబ్ డివిజనల్ పరిధిలో ప్రయాణికులు, మహిళలు, విద్యార్థినీ విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జిల్లాలోని ఇప్పటివరకు 3,232 ఆటోలలో అభయ మై టాక్సీ ఇస్ సేఫ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోగా అందులో ఉట్నూర్ సబ్ డివిజన్లో 850 ఆటోలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయన వివరించారు. ఆటోలలో ముందు భాగం, వెనుక భాగంలో క్యూఆర్ కోడ్, జిల్లా ప్రత్యేక నంబరు కలిగిన పోస్టర్ అతికించబడి ఉంటుందని, లోపలి భాగంలో ఆటో డ్రైవర్ వివరాలు, క్యూఆర్ కోడ్ , ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ కనబడే విధంగా పోస్టర్లను శాశ్వతంగా అతికిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రయాణికులు ఆ వాహనాలను ఎక్కిన వెంటనే క్యూఆర్ కోడ్ కనబడుతుందని , దానిని స్కాన్ చేసిన తర్వాత ప్రయాణికులకు వెబ్ అప్లికేషన్ లోకి వెళ్తుందని, అందులో మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత, వారికి మూడు భద్రత ఆప్షన్లు కనబడతాయని వివరించారు. ట్రాక్ మై లొకేషన్ ( Track My Location ) , ఎమర్జెన్సీ కాల్ ( Emergency ) , కంప్లైంట్ ఉంటాయని తెలిపారు. ప్రయాణికులకు కావలిసిన ఆప్షన్లు ఎంచుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందుతుందని ఎస్పీ తెలిపారు.
ఆటోలలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా, ఉత్తమ రేటింగ్ కలిగిన ఆటోల డ్రైవర్లను, యజమానులకు అవార్డులను అందించి ప్రోత్సహిస్తామని అన్నారు. అభయ మై టాక్సీ ఇస్ సేఫ్‌లో ఆటో డ్రైవర్లు రూ. 350 చెల్లిస్తే ఒక సంవత్సరం పాటు లక్ష రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఉట్నూర్ సీఐ జి మొగిలి, ఎస్సై మనోహర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.