యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : రైతులందరికీ ఆధార్ కార్డు తరహా ప్రత్యేక కార్డులు అందనున్నాయి. పథకాల అమలు కోసం 11 అంకెల యూనిక్ ఐడీతో కార్డులు జారీ చేయనున్నారు. అందుకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతున్నది.
రైతులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేందుకు ఆధార్ తరహాలో 11 నెంబర్ల గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులను జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ కార్డులను వ్యవసాయ పథకాలకు అనుసంధానం చేయనుంది. ఆధార్‌తో దేశంలోని ప్రతి పౌరుడికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 11నంబర్లతో సంఖ్యను కేటాయించి వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలని భావిస్తున్నది.
ప్రతి రైతు, భూమి వివరాలతో ఫార్మర్ రిజిస్ట్రీ జరుగుతుంది. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాలను, రైతు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసి ఫార్మర్ ఐడీని కేటాయిస్తారు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు ఏ రకమైన చట్టబద్ద యాజమాన్య హక్కునూ కల్పించదు.
ప్రయోజనాలు ఇలా..
కేంద్ర పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రీని అనుసంధానం చేస్తారు. తద్వారా రైతుల పంటలు, వారి వద్ద ఉన్న పశు సంపద తదితర సమాచారమంతా కేంద్రం దగ్గర ఉంటుంది. పీఏం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడుత లబ్ధి పొందేందుకు ప్రామాణికంగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి చేస్తూ ఇటీవల మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి.
ప్రస్తుతానికి రాష్ట్ర పథకాలు అయిన రైతు భరోసా, రుణమాఫీ స్కీమ్‌లకు ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధం లేదు. భవిష్యత్‌లో ఇదే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఐడీని ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంక్ లింకేజీతో కూడిన ఆర్థిక సేవలు పొందే అవకాశం కూడా ఉందంటున్నారు. దీని సాయంతో రుణ అర్హత, బకాయిలు, ప్రభుత్వ పథకాల జమ తదితర వివరాలను క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.
త్వరలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.30 లక్షల మంది రైతులు ఉన్నారు. రైతు విశిష్ట సంఖ్యను పొందేందుకు ఆధార్, భూ యాజమాన్య పాస్ పుస్తకం, ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నెంబరుతో సమీపంలోని వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి ఫార్మర్ ఐడీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.