Allahabad HC : సొంతంగా ఆర్జిస్తున్నప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి, అసత్యాలతో మాజీ భర్త నుంచి భరణం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఒక మహిళపై అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) అసహనం వ్యక్తంచేసింది. ఆమెకు భరణం చెల్లించాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఆమె పోషణకు అవసరమైన సొమ్మును ఆమే ఆర్జిస్తున్నారని, అలాంటప్పుడు భరణం దేనికని న్యాయస్థానం ప్రశ్నించింది.
పిటిషనర్ మాజీ భర్త అంకిత్ సాహా దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పింది. తాను పోస్టు గ్రాడ్యుయేట్‌నని, వెబ్ డిజైనింగ్‌లో ప్రావీణ్యం ఉందని పిటిషనర్ అంతకుముందు దిగువ కోర్టులో పేర్కొన్నారు. తాను ఒక కంపెనీలో సీనియర్ సేల్స్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నానని, నెలకు రూ.34 వేలు ఆర్జిస్తున్నానని కూడా ఆమె తెలిపారు. తాను నెలకు రూ.36వేలు సంపాదిస్తున్నట్లు ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్‌లో చెప్పారు.
ఎలాంటి బాదరాబందీలేని ఒక మహిళకు ఆ మొత్తం చాలా స్వల్పమని చెప్పలేమని కోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు పిటిషనర్ మాజీ భర్తకు వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవడం సహా అనేక బాధ్యతలు ఉన్నాయనే విషయాన్ని హైకోర్టు ధర్మాసనం ఎత్తిచూపింది. పిటిషనర్ తొలుత తన అఫిడవిట్లో పూర్తి వాస్తవాలను వెల్లడించలేదని అంతకుముందు ఆమె మాజీ భర్త తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
పిటిషనర్ ముందుగా తాను నిరక్ష్యరాస్యురాలినని, నిరుద్యోగినని చెప్పుకొన్నారని, అయితే ఆమె మాజీ భర్త దాఖలు చేసిన పత్రాన్ని ఆమెకు చూపి.. ప్రశ్నించినప్పుడు ఆమె తన ఆదాయాన్ని వెల్లడించారని తెలిపారు. దీన్నిబట్టి ఆమె దిగువ కోర్టును నిజాయతీగా ఆశ్రయించలేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. దాంతో సత్యంపట్ల ఎలాంటి గౌరవంలేని, వాస్తవాలను విస్మరించే కక్షిదారుల కేసులను న్యాయస్థానాలు బుట్టదాఖలు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నది.