సిటీబ్యూరో/ ఖైరతాబాద్ , జనవరి 29(నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీ అలియాస్ చుక్వు ఓబోనా డేవిడ్ ఐదు రోజుల కస్టడీ విచారణ శనివారం నుంచి ప్రారంభమైంది. టోనీని చంచల్‌గూడ జైలు నుంచి పంజాగుట్ట పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి.. రెండో అంతస్తులో ఉన్న క్రైం ఇన్వెస్టిగేషన్ చాంబర్లో విచారణను ప్రారంభించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న పంజాగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి బృందం టోనీని విచారించింది. ప్రధానంగా అతడికి నగరంలో ఎంతమంది వినియోగదారులు ఉన్నారు..? వారికి ఎంత కాలం నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు..? వంటి అంశాలపై ప్రశ్నలను అడిగారు. అతడి ఫోన్ కాంటాక్ట్స్‌తో పాటు బ్యాంక్‌లకు సంబంధించిన లావాదేవిలపై కూడా ఆరా తీస్తున్నారు. టోనీకి హైదరాబాద్‌లో వ్యాపారులు వినియోగదారులుగా ఎలా పరిచయమయ్యారు.? వారికి మధ్యవర్తిగా ఎవరు ఉన్నారు..? డ్రగ్స్ తీసుకున్న తర్వాత మత్తు బాబులు నగదును ఎలా చెల్లించే వారు..? వీరి ఫోన్ సంభాషణలు ఎలా జరిగేవి వంటి ప్రశ్నలతో జవాబులను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించనున్నారు. టోనీ ఆంగ్లంలో స్పష్టంగా మాట్లాడుతుండటంతో ప్రశ్నలను ఇంగ్లిష్‌లోనే అడిగారు. ఐదు రోజుల పాటు గడువు ఉండడంతో పక్కా సాక్ష్యాధారాలు సేకరణకే ప్రాధాన్యమిస్తూ.. నిందితులకు శిక్షలు పడేలా విచారణను పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. టోనీ చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉందనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ప్రత్యేక బృందం విశ్లేషించుకునేందుకు సిద్ధంగా ఉంది.
స్టార్ బాయ్ కోసం..
టోనీ ఇండియాకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నడిపిన డ్రగ్స్ దందా లెక్కలపై కూడా పోలీసులు ఆరా తీయనున్నారు. హైదరాబాద్‌కు టోనీ ఎన్ని సార్లు వచ్చాడు..? ఎక్కడ బస చేశాడు..? అతడికి ఇతర బడా వ్యాపారులు లేదా టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో ఏమైనా నేరుగా డీలింగ్స్ ఉన్నాయా..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. టోనీకి విదేశాల నుంచి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు చెబుతున్న స్టార్ బాయ్ కోసం కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు స్టార్‌బాయ్ ఎక్కడ..ఎలా ఉంటాడు..ఇండియాకు వచ్చాడా…డ్రగ్స్‌ను ఎలా పంపిస్తాడు. వాటికి ఏమైనా ప్రత్యేక కోడ్లను పెట్టుకుంటారా..డ్రగ్స్ సరఫరా టైమింగ్ గురించి కూడా తెలుసుకునేందుకు పోలీసులు స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నారు. పంజాగుట్ట పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా టోనీని ప్రత్యేకంగా విచారించనున్నారని సమాచారం. కాగా, టోనీ కస్టడీ విచారణ వివరాలను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. మరోవైపు కీలక విషయాలను రాబట్టేందుకు టోనీకి ఇష్టమైన ఆహారాన్ని కూడా పెట్టారు. విచారణ ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు.