వనపర్తి (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికలకు(Muncipal elections) ముందే బీఆర్ఎస్ సమర శంఖారావాన్ని పూరించింది. వనపర్తి పట్టణంలో ఎమ్మెల్సీ, వనపర్తి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ స్వామి గౌడ్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీని చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించిన మోటర్ సైకిల్ ర్యాలీ ఊహించని రీతిలో విజయవంతమైంది.
అనంతరం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో స్వామి గౌడ్, నిరంజన్ రెడ్డి మాట్లాడారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో వనపర్తి మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని, ఇందుకు మోటర్ సైకిల్ భారీ ర్యాలీనే నిదర్శనమన్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, ప్రజలే మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం కాంగ్రెస్ కు చెబుతారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వేసే ఎత్తుగడలను దీటుగా ఎదుర్కొని ఓటర్లను వీలైనన్ని ఎక్కువసార్లు కలిసి ఓటును అభ్యర్థించాలని సూచించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేవి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని, కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ద్వారా ప్రకటింపజేసిన వాగ్ధానాలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందే దాకా నాయకులు, కార్యకర్తలు విశ్రమించకూడదన్నారు.