సిరికొండ, జనవరి 7: మండలంలోని తూంపల్లి పరిధిలో ఉన్న కొత్త తిరుపతి గుట్ట కంపార్ట్మెంట్ నంబర్ 500 బీట్ అటవీ ప్రాంతంలో జిట్టపులి సంచరిస్తున్నది. మంగళవారం రాత్రి ఓ లేగదూడను హతమార్చిం ది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన కాప్చర్ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. గోప్యానాయక్తండాకు చెందిన దూడ యజమాని ఇచ్చిన సమాచారం మేర కు ఇన్చార్జి ఎఫ్ఆర్వో రవీందర్ బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పశువైద్యాధికారి అభిషేక్ లేగదూడ కళేబరానికి అక్కడే పంచనామా నిర్వహించారు. దూడ విలువ రూ.30వేలు ఉంటుందని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి పరిహారం అందేలా చూస్తామని ఎఫ్ఆర్వో తెలిపారు. అటవీ జంతువులు ఆవులు, ఇతర పశువులను హతమారిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, అటవీశాఖ తరఫున పరిహారం అందిస్తామన్నారు. అటవీ జంతువులను హతమారిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. జిట్టపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
దేమికలాన్లో లేగ దూడ హతం..
లింగంపేట(తాడ్వాయి), జనవరి 7: తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో చిరుత ఓ లేగదూడను చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. గొల్ల సంజీవులు తన దూడలను పాకలో కట్టివేయగా.. మంగళవారం రాత్రి సమయంలో పాకలోకి చొరబడిన చిరుత దూడను హతమార్చిందన్నారు. 20రోజుల వ్యవధిలో మొత్తం ఐదు దూడలను చిరుత చంపిందని తెలిపారు. విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలుపగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. చిరుత పాద ముద్రలను పరిశీలించారు.