న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఐటీ దిగ్గజం టీసీఎస్ రికార్డుల మోత మోగించింది. ఆదాయ ఆర్జనలోనూ, నియామకాల్లోనూ, ఆర్డర్ల సాధనలోనూ కొత్త రికార్డుల్ని నెలకొల్పింది. 2022 మార్చితో ముగిసిన నాల్గో క్వార్టర్లో టీసీఎస్ ఆదాయం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 16 శాతం వృద్ధితో రూ.50,591 కోట్లకు చేరింది. ఒకే త్రైమాసికంలో రూ.50,000 కోట్లకుపైగా ఆదాయాన్ని ఆర్జించిన తొలి దేశీ ఐటీ కంపెనీ ఇదేకావడం గమనార్హం. కార్పొరేట్లు డిజిటలైజేషన్‌కు వ్యయాల్ని అధికం చేయడంతో టీసీఎస్ బిజినెస్ వర్టికల్స్అన్నింటిలోనూ వ్యాపారాన్ని పెంచుకోవడంతో రికార్డు ఆదాయం సాధ్యపడింది. 2021లో ఇది రూ.43,705 కోట్లుగా ఉంది. మూడో త్రైమాసికమైన అక్టోబర్-డిసెంబర్లో రూ. 48,885 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఇక నికరలాభం 7 శాతం వృద్ధిచెంది రూ. 9,246 కోట్ల నుంచి రూ. 9,926 కోట్లకు పెరిగింది. క్యూ3లో ఇది రూ. 9,769 కోట్లు. ఆర్థిక ఫలితాల వివరాలివీ..
తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నియామకాల్లోనూ రికార్డు నెలకొల్పింది. 2022తో ముగిసిన ఏడాదికాలంలో 1,03, 546 మందిని రిక్రూట్ చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. దాదాపు 78,000 మంది ప్రెషర్లను నియమించింది. 2020-21లో 40,000 మంది తాజా గ్రాడ్యుయేట్లు నియమితులయ్యారు. మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,92,195కు చేరింది. ఈ జనవరి-మార్చి క్వార్టర్లో కంపెనీ నుంచి వలస వెళ్లిన ఉద్యోగుల శాతం 17.4కు చేరింది. ముగిసిన ఏడాది 40,000 మంది ప్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకోవాలన్న లక్ష్యంతో క్యాంపస్ హైరింగ్ ప్రారంభించి, 78 వేల మందికి పైగా నియమించామని, ఇదే తరహాలో ప్రస్తుత 2022-23లో 40 వేల నియామకాల ప్రారంభ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు టీసీఎస్ సీవోవో సుబ్రమణియం చెప్పారు. వ్యాపార వాతావరణాన్ని బట్టి ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. తమ ఉద్యోగుల్లో ఇప్పుడు 95% మంది ఆఫీసు నుంచే పనిచేస్తున్నారని, అయితే టాప్ టైర్లో ఉన్న 50,000 మంది ఉద్యోగులు త్వరలో వారానికి 3 రోజులే ఆఫీసు నుంచి పనిచేస్తారని, ఈ ఏడాది మధ్యనాటికల్లా ఐదో వంతు సిబ్బంది వర్క్ ఫ్రం హోంను పాటిస్తారని వివరించారు.