కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 14: ఆడపిల్ల పుడితే రూ.5 వేల పోస్టల్ పాలసీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కరీంనగర్ రూరల్ మండలంలోని మొగ్దుంపూర్ సర్పంచ్ జక్కం నర్సయ్య. గత జనవరిలో నిర్వహించిన గ్రామసభలో ప్రకటించిన ఆయన అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం ఆచరణలోకి తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన వేల్పుల ప్రశాంత్ – సత్యవతి దంపతుల కూతురు శ్రీనిక, ఎలగందుల అభిలాష్-చందన కూతురు శ్రీహిత పేరిట రూ. 5 వేల చొప్పున పోస్టల్ పాలసీలు చేయించారు. గురువారం కరీంనగర్ రూరల్ ఎస్సై అశోక్ చేతుల మీదుగా పాలసీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న సర్పంచ్‌ను ప్రజాప్రతినిధులు, నాయకులు అభినందించారు.