హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంచాయతీ సర్పంచుల గౌరవ వేతనాలు ఐదు నెలలుగా అందడం లేదు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రెండు నెలలైనా వారి ఖాతాల్లో జీతాలు జమకాలేదు. ఉపాధి సిబ్బందికీ ఏప్రిల్, మే నెలల జీతాలు ఇవ్వనేలేదు. వీరంతా సుమారు 95,346 మందికి పైగా ఉంటారు. ఈ అంశాలే రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికీ ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నామన్న కాంగ్రెస్ పాలకుల మాటలు నీటిమూటలుగా మారుతున్నాయనడానికి నిదర్శనాలు. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో నెలల తరబడి వేతనాలు పెండింగ్లో పడుతున్నాయి. ఫలితంగా ఆయా విభాగాల సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాయి.
అన్నిశాఖల హెచ్వోడీలు ఆయా శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, దినసరి వేతనాలు పొందే అన్ని విభాగాల సిబ్బందికి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎఫ్ఎంఎస్) ద్వారా వివరాలు తీసుకొని ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని ఆర్థికశాఖ నుంచి ఆదేశాలు వెలువడినా కేత్రస్థాయిలో అమలుకు నోచడం లేదు. వచ్చే కొద్దిపాటి వేతనాలు కూడా నెలల తరబడి తొక్కిపెట్టడంతో బడుగు వేతన జీవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే జూన్.. ఆపై పిల్లల బడి ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్లు ఇతర ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ లేక ఆయా కుటుంబాలు సతమతం అవుతున్నాయి. తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆయా శాఖల కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. అయినా, పట్టించుకొనే నాథుడే లేకపోవడంతో సోషల్ మీడియా వేదికలపై అటు ప్రభుత్వంపై, ఇటు పాలకులపై విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరును, సీఎం రేవంత్రెడ్డి వైఖరిని ఎద్దేవా చేస్తూ మీమ్స్, వ్యతిరేక పోస్టులు చేస్తున్నారు.
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 99, పట్టణ ప్రాంతాల్లో 25, గిరిజన ప్రాంతాల్లో 25 ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) చొప్పున మొత్తంగా 149 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 35,781 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తుండగా ఒక్కో కేంద్రంలో టీచర్, ఆయా పనిచేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో 70 వేల మందికిపైగా పనిచేస్తున్నారు. వీరు తమకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదని ప్రభుత్వానికి, అధికారులకు మొరపెట్టుకోగా, ఇటీవలే కేవలం పది జిల్లాల సిబ్బందికి ఏప్రిల్ నెల వేతనం మాత్రమే చెల్లించారు. మిలిగిన 23 జిల్లాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు విడుదల చేయనేలేదు. ఏ ప్రాతిపదికన వీరికి వేతనాలు విడుదల చేశారో తెలియదు.
మే నెల వేతనం మాత్రం ఎవరికీ రాలేదు. గతంలో అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్లకు 12 నెలల వేతనాలు ఏడాదికాలంగా తొక్కిపెట్టారు. పాత బకాయిలతోపాటు రెండు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ శృతి ఓఝాకు తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ (మినీ) టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి నేతృతంలో ప్రతినిధులు శుక్రవారం వినతిపత్రం అందించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద 12,500 మందికి పైగా సిబ్బంది వివిధ క్యాటగిరీల్లో పనిచేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఇలా 12,586 మంది పనిచేస్తున్నారు. వీరికి ఏప్రిల్, మే నెలల వేతనాలు ఇప్పటివరకు అందలేదు. ప్రతిసారీ ఒకనెల వేతనం చెల్లించి మరో నెల వేతనం పెండింగ్లో పెడుతున్నారని ఆయా సిబ్బంది వాపోతున్నారు. అప్పులు చేసి కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నెలకు వచ్చేది కేవలం రూ.8,500. అది కూడా సక్రమంగా చెల్లించకపోతే కుటుంబాలను ఎట్లా పోషించాలి? అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో పంచాయతీ సర్పంచులుగా బాధ్యతలు చేపట్టి 5 నెలలు దాటినా వారికి అణాపైసా సర్కార్ విదల్చలేదు. రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు ఉండగా, 12,702 గ్రామాల్లో కొత్తగా పాలకవర్గాలు ఏర్పడ్డాయి. నిరుడు డిసెంబర్ 22వ తేదీన పంచాయతీల్లో సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. వీరికి నెలకు రూ.6,500 చొప్పున గౌరవ వేతనం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నది. ఇలా 5 నెలలుగా ఒక్కొక్కరికీ రూ.32,500 చొప్పున ప్రభుత్వం బకాయి పడింది. 5 నెలల బకాయి రాష్ట్రవ్యాప్తంగా రూ.41.28 కోట్లు రావాల్సి ఉన్నది. తమ గౌరవ వేతనాలు చెల్లించాలని సర్పంచులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు.