
సికింద్రాబాద్, జనవరి 5: పదవి టీఆర్ఎస్ పార్టీ భిక్ష వల్లే వచ్చింది..ఇక పదవి వచ్చిందే తడువు. ప్రొటోకాల్ పాటించడం తెలియదు…..దొంగచాటు పనులకే మొగ్గుచూపుతూ కంటోన్మెంట్లో కమలం పార్టీ నేతలు చేస్తున్న పనులకు జనం ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో జరిగే రీ కార్పెంటింగ్ పనులకు శిలాఫలకాలు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు. కానీ తమ పార్టీ వల్లే బీటీ రోడ్డు పనులు మంజూరయ్యాయంటూ నిసిగ్గుగా శిలాఫలకాలు ఏర్పాటు చేసుకోవడం, స్థానిక ఎమ్మెల్యేతో పాటు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ రాకముందే దాన్ని ఆవిష్కరించడం పెద్ద దుమారాన్నే లేపుతుంది.
ఇదిలా ఉండగా చిన్నతోకట్ట నుంచి ‘యూ’ ఆకారంలో సెవన్ టెంపుల్ మీదుగా కంసారి బజార్ ఛాయ్ అడ్డా వరకు సుమారు రూ.72లక్షలతో బీటీ రోడ్డు రీ కార్పెంటింగ్ పనులకు గతంలో కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడిగా జక్కుల మహేశ్వర్‌రెడ్డి ఉన్న సందర్భంలోనే పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. కానీ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడిని రక్షణ శాఖ నియమించకముందే ఇటీవల కాలంలోనే చిన్నతోకట్ట నుంచి సెవన్ టెంపుల్ రోడ్ రీ కార్పెంటింగ్ పనులు ప్రారంభం అయ్యాయి.
కానీ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి మాత్రం రీ కార్పెంటింగ్ పనులకు శిలాఫలకాలు ఏర్పాటు చేయకుండా…కావాల్సింది పేరు కాదు…పనులు ముఖ్యం అనే నినాదంతో ముందుకు సాగడం జరిగింది. కానీ కాషాయం నేత మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ప్రొటోకాల్ నిబంధనలు తుంగలో తొక్కుతూ బరితెగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఎమ్మెల్యే సాయన్న బీటీ రోడ్డు పనులు ప్రారంభించే సమయానికే సివిలియన్ మెంబర్ దొంగచాటుగా వచ్చి శిలాఫలకాలన్ని ఆవిష్కరించడంతో ఆసహనానికి గురయ్యారు.
దీంతో ఎమ్మెల్యే సాయన్నతో పాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో సహా ఇతర టీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు. నిరసన వ్యక్తం చేసిన వారిలో బోర్డు మాజీ సభ్యు లు పాండుయాదవ్, నేతలు నివేదిత, ముప్పిడి గోపాల్, ముప్పిడి మధుకర్, టీఎన్ శ్రీనివాస్, పూర్ణచంద్రారెడ్డి, దేవులపల్లి శ్రీనివాస్, మహంకాళి శర్విన్, సాయికిరణ్, సదానంద్‌గౌడ్, మురళీయాదవ్, సంతోష్, ఎనముల విజయ్, సురేశ్, సంపత్, ప్రవీణ్, రాజ్‌సింగ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
చిల్లర రాజకీయాలు చేసే వారికి గుణపాఠం తప్పదు
కంటోన్మెంట్లో చిల్లర రాజకీయాలకు పాల్పడితే గుణపాఠం తప్పదు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్న చందంగా బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తీరు ఉంది. ప్రొటోకాల్ పాటిం చకుండా ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలిగిస్తుంది. గతంలో మంజూరైన బీటీ రోడ్డు పనులను తానే స్వయంగా మం జూరు చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు.ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. ఇప్పటికైనా ఒంటెద్దు పోకడలు మానుకోవాలి.
జి. సాయన్న, ఎమ్మెల్యే, కంటోన్మెంట్
అభివృద్ధి చేసి చూపించాలి
తమకు శిలాఫలకాల ఏర్పాటు ముఖ్యం కాదు. కొత్త పనులకు నిధులు మంజూరు చేయించి అభి వృద్ధి చేయడమే లక్ష్యం. కంటోన్మెంట్ పరిధిలో ఇప్పటి వరకు రీ కార్పెం టింగ్ పనులకు శిలాఫల కాల ఏర్పాటు చేసిన దాఖ లాలు లేవు. కేవలం ఈ వార్డులో చిచ్చు పెట్టేందుకే రామ కృష్ణ డ్రామాలు మొదలు పెట్టారు. ఈ డ్రామాలు ఎంతో కాలం నడవవు. తన హయాంలో జరిగిన పనులను కొత్త గా చేస్తున్నట్లు బీజేపీ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదం.
జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు