Hyderabad | రంగారెడ్డి జిల్లా యాచారం పీఎస్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న సమయంలో తప్పించుకోవడానికి ఓ వ్యక్తి కారుతో ఎస్సైని ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా అరకిలోమీటర్ వరకు కారు బ్యానెట్‌పైనే ఈడ్చుకెళ్లాడు.
వివరాల్లోకి వెళ్తే.. యాచారం పట్టణంలోని బస్టాండ్ వద్ద ఆదివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. అదే సమయంలో వేగంగా వస్తున్న ఓ కారును ఆపాలను పోలీసులు సూచించారు. కానీ ఆపకపోవడంతో ఎస్సై మధు కారుకు అడ్డంగా వెళ్లాడు. అయినా కారును ఆపకుండా ఎస్సైని ఢీకొట్టి ముందుకెళ్లిపోయాడు. కారు ఢీకొనడంతో ఎస్సై బ్యానెట్‌పై పడిపోయాడు. అయినప్పటికీ సదరు వ్యక్తి కారును ఆపకుండా అరకిలోమీటర్ వరకు అలాగే ఎస్సైని తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ఓ బైక్‌ను ఢీకొట్టాడు. యాచారం పట్టణం దాటిన తర్వాత కారు వేగం కాస్త తగ్గడంతో ఎస్సై బ్యానెట్‌పై నుంచి దూకేశాడు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వెంకట్ రెడ్డి, ఆయన కోడలు దివ్య, మనుమడు గాయపడ్డారు. దివ్య చేయి విరిగింది.
పరారైన నిందితుడిని యాచారం పోలీసుల సమాచారంతో ఇబ్రహీంపట్నం సమీపంలోని ఖానాపూర్ వద్ద కారును అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. ఇందులో డ్రైవింగ్ చేసిన వ్యక్తిని కోహెడకు చెందిన శ్రీకర్‌గా గుర్తించారు. మరో వ్యక్తిని శ్రీకర్ స్నేహితుడు, హయత్ నగర్‌కు చెందిన నితిన్‌గా గుర్తించారు.