హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్’) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతల ఉన్నతస్థాయి బృందం శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నది. సాయంత్రం 4:30 గంటలకు ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ)తో ఈ బృందం ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ ప్రతినిధి బృందంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారథిరెడ్డితోపాటు మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత బోయినపల్లి వినోద్‌కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్ తదితరులు ఉన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న ‘సర్’పై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పలు కీలక సూచనలు చేయనున్నది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం ‘ఒక వ్యక్తికి ఒకే ఓటు’ విధానాన్ని పటిష్టంగా అమలుచేయాలని బీఆర్ఎస్ నేతలు సీఈసీని కోరనున్నారు. ఒక వ్యక్తికి వేర్వేరు ప్రాంతాలు లేదా రాష్ట్రాల్లో రెండు ఓట్లు ఉండటం వల్ల జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయనున్నారు.