మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని పోలీసులు ఎంత చెబుతున్నా మార్పు రావడం లేదు. పీకలదాకా తాగడం, సోయి లేకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటూ మృత్యుఒడికి చేరుతున్నారు. వారం కిందట అర్ధరాత్రి తర్వాత బంజారాహిల్స్ రోడ్‌నెం.3లో తాగిన మైకంలో యువకులు కారు నడుపుతూ ఇద్దరి మృతికి కారణమయ్యారు.ఈ ఘటన మరువకముందే మద్యం మత్తులో 140 వేగంతో కారు నడుపుతూ చెట్టును ఢీకొట్టి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున గచ్చిబౌలి ఎల్లమ్మ ఆలయం వద్ద జరగగా, వేగం ధాటికి కారు రెండు తునకలైంది. ఇలాంటి ఘటన సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రథమం. అతివేగంగా ఉండడంతో బెలూన్లు తెరుచుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. మృతుల్లో ఇద్దరు యువతులు కాగా,మరొకరు బ్యాంకు ఉద్యోగి. షార్ట్‌ఫిల్మ్ షూటింగ్ పూర్తయిన తర్వాత ధావత్ చేసుకొని లింగంపల్లిలో చాయ్ తాగుదామని వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ముచ్చట్లతో అటెన్షన్ డైవర్షన్ కావడం వల్లే ఘటన చోటుచేసుకుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
చాదర్‌ఘాట్, డిసెంబర్ 18: బాన్సువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఏడుగురు మృతిచెందారు. మృతులు చాదర్‌ఘాట్‌కు చెందిన వారు కావడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. ఆజంపురా డివిజన్లోని మూసానగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అమీర్(25) ఏసీ టెక్నీషియన్. అదే డివిజన్లోని వినాయకవీధికి చెందిన మహ్మద్ హుస్సేన్ మినరల్ వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నాడు. అమీర్ తన భార్య సనా పర్వీన్(20), కుమార్తెలు ఆన్య ఫాతిమా(ఏడాదిన్నర), హన్నాన్ ఫాతిమా(నాలుగు నెలలు), మహ్మద్ హుస్సేన్(27) , తస్లీం బేగం(25) దంపతులు, హజ్రా బేగం(6), నూర్ బేగం(5), సుల్తానా(3), హాదీ(8), హిబా(4) రెండు కుటుంబాలు తమ పిల్లలతో నాందేడ్‌లోని దర్గా దర్శనార్థం రెండు రోజుల కిందట కారులో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో శనివారం అమీర్ వాహనాన్ని నడిపిస్తుండగా, బాన్సువాడ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ప్రమాదంలో అమీర్, అతడి భార్య సనా పర్వీన్, ఇద్దరు కుమార్తెలు, మహ్మద్ హుస్సేన్, తస్లీం బేగం దంపతులు, నూర్ బేగం చనిపోయారు. హాదీ చికిత్స పొందుతున్నాడు.
వంద వేగంతో..
హర్యానా నుంచి భారీ లోడ్‌తో వస్తున్న లారీని డ్రైవర్ పక్కకు నిలిపి భోజనం చేసేందుకు దాబాకు వెళ్లాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కారును ఎడమవైపునకు తిప్పే క్రమంలో లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారు వేగం 100 దాటినట్లు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల పరామర్శించారు.