రామగిరి, నవంబర్ 18 : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి స్టేడియం స్విమ్మింగ్ పూల్‌లో మంగళవారం 69వ రాష్ట్రస్థాయి అండర్–14 బాల, బాలికల స్విమ్మింగ్ పోటీలను రాష్ట్ర మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి. జన ప్రసాద్, ఏసీబీ అధికారి మడత రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆటలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, మంచి అలవాట్లు, సమాజంలో గుర్తింపు తీసుకువస్తాయని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు క్రీడలు కీలకమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ఆటల పీరియడ్‌ను తప్పనిసరి చేస్తూ క్రీడలకు పెద్ద పీట వేస్తోందని గుర్తుచేశారు.
సింగరేణి ఆర్జీ–3 జీఎం సుధాకర్ రావు మాట్లాడుతూ స్టేడియం వినియోగాన్ని సమాజ అభివృద్ధికి అందిస్తూ క్రీడలకు ఎల్లప్పుడూ సింగరేణి అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఆసంపల్లి ఫౌండేషన్ చైర్మన్ ఆసంపల్లి వాసు పెద్దపల్లి జిల్లాలో అన్ని క్రీడలకు తమ వంతు తోడ్పాటు కొనసాగిస్తామని తెలిపారు. ఐఎన్టీసీ నాయకులు పైసల్ శ్రీనివాస్ స్విమ్మింగ్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారని జేసీపీ ప్రశంసించారు. రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలను మొదటిసారిగా పెద్దపల్లి జిల్లాకు తీసుకురావడం గర్వకారణమని ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ లక్ష్మణ్ తెలిపారు. కార్యక్రమంలో DYSSO అక్కపాక సురేష్, రాష్ట్ర బాధ్యులు శోభారాణి పాల్గొన్నారు.