న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధర.. అంతే స్థాయిలో పడిపోయింది. అంతర్జాతీయంగా డిమాండ్ లేమి, రూపాయి బలపడటంతో దేశీయంగా ధరలు భారీగా తగ్గాయి. గురువారం రూ.2 వేల స్థాయిలో పెరిగిన బంగారం ధర.. శుక్రవారం వెయ్యి రూపాయలకుపైగా తగ్గి 51 వేల దిగువకు పడిపోయింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.1,270 దిగి రూ.50,910గా నమోదైంది. ఇక పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు నిలిచిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.2,200 తగ్గి రూ.64,800గా నమోదైంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.440 తగ్గి రూ.51,110కి దిగిరాగా, 22 క్యారెట్ల ధర రూ.400 తగ్గి రూ.46,850గా నమోదైంది. అలాగే వెండి రూ.2,700 తగ్గి రూ.70 వేలకు దిగొచ్చింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 27 పైసలు బలపడటం, గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ధరలు దిగిరావడం కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,913 డాలర్లు, వెండి 24.29 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.