ప్రభుత్వం రుణమాఫీ ఆలస్యం చేస్తుండడంతో రైతులపై నెలనెలా వడ్డీ రూపంలో భారం పడుతున్నది. ఇప్పటివరకు రూ.లక్ష, రెండు లక్షలలోపు రుణాలు తీసుకున్న వారిలో సగం మందికే రుణమాఫీ అయ్యింది. మిగతావారు మాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. రూ. రెండు లక్షలపైన రుణం వారు వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం చెప్పడంతో వారు చెల్లించి మాఫీ కోసం చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాట తప్పి వ్యవహరిస్తున్నది. దాంతో రైతులపై వడ్డీ భారం పడుతున్నది. సూర్యాపేట జిల్లాలో నెలకు రూ.17 వేల చొప్పున మూడు నెలల్లో వడ్డీ రూపంలో 51 కోట్ల అదనపు భారం పడుతున్నది. జిల్లా వ్యాప్తంగా 2.60 లక్షల మంది రైతులు దాదాపు 3వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకోగా ఇప్పటి వరకు మూడు విడుతల్లో 1,00,583 మంది రైతులకు రూ.837 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. ఈ లెక్కన జిల్లాలో దాదాపు రూ.2,160 కోట్లు మాఫీ కావాల్సి ఉన్నది.
– సూర్యాపేట, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ)
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తున్నట్లు ఎంతో ఆర్భాటం చేసిన రేవంత్ సర్కార్ అభాసుపాలవుతున్నది. రెండు లక్షల రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇవ్వడంతో గత బీఆర్స్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశతో రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు తిరకాసు పెడుతున్నది. రుణమాఫీకి రైతులకు రేషన్ కార్డులు లేవని, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వలేమని, తదితర కారణాలతో కొర్రీలు పెడుతున్నది.
సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 51 శాతానికి మించి రుణమాఫీ చేయలేదు. జిల్లాలో రుణాలు తీసుకున్న 2.60 లక్షల మంది రైతులు సుమారు రూ.3,350 కోట్ల రుణాలు తీసుకున్నారు. దీంట్లో రెండు లక్షల రూపాయల లోపు తీసుకున్న వారే 90 శాతం మంది ఉన్నారు. 1.60 లక్షలకు పైన రుణాలు తీసుకోవాలంటే నిబంధనల మేరకు షూరిటీలు ఇవ్వాల్సి ఉండడంతోపాటు వడ్డీ రేటు కూడా మారుతుందని, అందుకే రెండు లక్షలు దాటి రుణాలు తీసుకునే రైతుల సంఖ్య వేళ్లపై లెక్కేసేంత మంది ఉంటారని ఓ బ్యాంక్ అధికారి తెలిపారు. ఈ లెక్కన జిల్లాలో సుమారు 2.35లక్షల మంది రైతులు రెండు లక్షల లోపు రుణాలు తీసుకొని ఉంటారని, అంతా కలిపి దాదాపు రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని సదరు అధికారి అంచనా వేశారు.
తొలి విడుతగా లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు జిల్లాలో 56,217 మంది ఉన్నట్లు గుర్తించి రూ.282.98 కోట్లు మాఫీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడుతలో 26,437 మంది రైతులకు రూ.250 కోట్లు, మూడో విడుతలో 17,870 మంది రైతులకు రూ.305 కోట్లు మాఫీ అయినట్లు చెప్పింది. మూడు విడతలు కలిపి జిల్లాలో 1,00,583 మంది రైతులకు రూ.837 కోట్లు మాఫీ చేసినట్లు లెక్క. దీని ప్రకారం మరో 1.35 లక్షల మంది రైతులకు దాదాపు రూ.2 వేల కోట్లు మాఫీ కావాల్సి ఉందని తెలుస్తుంది.
మాఫీ చేయకపోవడంతో ప్రతినెలా రూ.17 కోట్ల అదనపు భారం
ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేయకపోవడంతో జిల్లా రైతులపై వడ్డీ రూపంలో ప్రతి నెలా రూ.17 కోట్ల భారం పడుతున్నది. 9శాతం వడ్డీ చొప్పున రూ.రెండు వేల కోట్లకు నెలకు రూ.17 కోట్లు అవుతుతున్నది. రుణమాఫీ ఆగస్టులో చేయకపోవడంతో మూడు నెలలు గడిచిపోయింది. ఈ మూడు నెలలు కలిపి రూ.51 కోట్ల వడ్డీ భారం రైతులపై పడుతున్నది. ప్రభుత్వం రుణమాఫీని పూర్తి స్థాయిలో ఎప్పుడు చేస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వడ్డీ పెరుగుతున్న నేపథ్యంలో ఆ భారాన్ని మోయడం తమ వల్ల కాదని, తక్షణమే ప్రభుత్వం వందశాతం రుణమాఫీ చేయడంతోపాటు మూడు నెలల వడ్డీని కూడా చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వడ్డీని ప్రభుత్వమే భరించాలి
నేను కెనరా బ్యాంకులో ఒక లక్షా తొంభై వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాం. రుణమాఫీ విషయంపై బ్యాంకుకు వెళ్తే లిస్టులో నీ పేరు లేదన్నారు. వ్యవసాయ అధికారి కార్యాలయానికి వెళ్తే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. నెల రోజుల క్రితం మళ్లీ దరఖాస్తు చేసుకున్నాను. ఆ తర్వాత బ్యాంకు, వ్యవసాయ అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. ఇప్పటికి వడ్డీ పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నా. అసలు, వడ్డీ నాలాంటి పేద రైతు కట్టలేని పరిస్థితి. వెంటనే రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసి పెరిగిన వడ్డీ కూడా ప్రభుత్వమే భరించాలి.
-గుంటి రవికుమార్, రైతు, బొల్లంపల్లి, జాజిరెడ్డిగూడెం మండలం
రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
అధికారంలోకి వస్తే రుణమాఫీ వెంటనే అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. వ్యవసాయ అవసరం కోసం నేను గతంలో మేళ్లచెర్వు గ్రామీణ బ్యాంకులో రూ.2 లక్షల లోన్ తీసుకున్నా. వడ్డీ చెల్లిస్తే వెంటనే రుణమాఫీ చేస్తారని చెప్పడంతో గత ఆగస్టులో రూ. 39 వేల వడ్డీ చెల్లించాను. ఇప్పటికీ మూడు నెలలు కావస్తున్నా నాకు రుణమాఫీ కాలేదు. మళ్లీ వడ్డీ పెరిగిపోతుంది. ఇది మాలాంటి సన్నకారు రైతులకు పెనుభారంగా మారుతుంది. ప్రభుత్వం వెంటనే అర్హులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలి.
– జనిగ సైదులు, రైతు, మాజీ ఎంపీటీసీ, మేళ్లచెర్వు
పంట చేతికి అంది వచ్చింది..ఇంకా రుణ మాఫీ కాలేదు
నాకు మా గ్రామ శివారులో ఉన్న 3.39 ఎకరాల వ్యవసాయ భూమిపై సూర్యాపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2 లక్షల 15 వేలు రుణం తీసుకున్న. రుణ మాఫీ అవుద్దని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నం. మొదటి విడుతలో కాలేదు. రెండో విడుతలోనైనా అవుద్దనుకున్నా. కానీ మూడో విడుతలో కూడా నాపేరు లేదు. బ్యాంకులో అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. ఎక్కువ తక్కువలతో సంబంధం లేకుండా రైతులందరికీ వంద శాతం రుణమాఫీ చేసి ఆదుకోవాలి. రైతు భరోసా పెట్టుబడి సాయం ఇంకా ఇవ్వలేదు. అప్పులు చేసి నాట్లు వేసినం, ఎరువులు కూడా అప్పులు చేసి తెచ్చుకున్నం. ఇప్పుడు పంట చేతికి అంది వచ్చింది. కానీ మాకు మాత్రం రుణ మాఫీ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసి మమ్ములను ఆదుకోవాలి.
-ఎక్కటి శ్యాంసుందర్ రెడ్డి, రైతు గుంజలూరు, చివ్వెంల