హైదరాబాద్, ఫిబ్రవరి 11: హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సేవల సంస్థ ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను నికర లాభంలో 50.5 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. 2020-21 మూడో త్రైమాసికంలో రూ.8.8 కోట్లుగా ఉన్న పన్ను చెల్లించిన తర్వాత నికర లాభం గత త్రైమాసికానికిగాను రూ.13.3 కోట్లకు ఎగబాకినట్టు వెల్లడించింది. అటు ఆదాయంలోనూ రూ.55.2 కోట్ల నుంచి రూ.78.1 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.599.60 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. అలాగే ఇతర దేశాలకు కంపెనీకి చెందిన ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో రూ.31 కోట్ల నిధులు సమకూరినట్లు పేర్కొంది. మరోవైపు రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.3 లేదా 30 శాతం మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు కంపెనీ ఎండీ, ప్రమోటర్ పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అటు ఆదాయం, నికర లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని ఆయన చెప్పారు. దేశీయ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లనే గత త్రైమాసికంలో అణు విద్యుత్, రక్షణ, డిఫెన్స్ రంగాల నుంచి భారీగా ఆర్డర్లు వచ్చాయని చెప్పారు.