అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు (AP TET Results) విడుదలయ్యాయి. 50.79 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం https://cse.ap.gov.inలో చూడవచ్చు. అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా, 3,68,661 మంది హాజరయ్యారు. ఇందులో 1,87,256 మంది అర్హత సాధించారు. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్షీట్లను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 29న ఫైనల్ కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్నారు.
విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి నిబంధనల ప్రకారం, ప్రకారం ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధించాలంటే తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించాలి. ఉపాధ్యాయ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్-1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు, పేపర్-2కు అర్హత సాధించిన అభ్యర్థులు 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. టెట్‌కు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఇస్తున్న విషయం తెలిసిందే.