ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని ఖవాయిపుర్ ప్రాంతంలో జరిగింది. మృతిచెందిన అయిదుగురిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. బాధితుల్లో రామ్ కుమార్ యాదవ్(52), ఆయన భార్య కుసుమ్ దేవి(52), కూతురు మనీషా(25), కోడలు సవిత(27), మనవరాలు మీనాక్షి(2)లు ఉన్నారు. ఈ ఘటనలో అయిదేళ్ల మనవరాలు సాక్షి ప్రాణాలతో బయటపడ్డారు. రామ్ యాదవ్ కుమారుడు సునీల్(30) మర్డర్ జరిగిన సమయంలో ఇంట్లో లేడు. అయితే కేసు విచారణలో అతను సహకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మృతిచెందిన వారి శరీరాలపై మరకలు ఉన్నాయని, అందరి తలపై గట్టిగా కొట్టినట్లు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు.
మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం హాస్పిటల్‌కు పంపారు. నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులు ఏడు బృందాలుగా అన్వేషిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు కూడా క్రైమ్ సీన్‌కు వచ్చారు. యాదవ్ ఇంట్లో తొలుత మంటల చెలరేగినట్లు స్థానికులు చెప్పారని జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ ఖత్రి తెలిపారు.
ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఏప్రిల్ 16వ తేదీన కూడా ఓ దారుణమైన నేరం జరిగిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. 38 ఏళ్ల ప్రీతి తివారితో పాటు ఆమె ముగ్గురు కూతుళ్ల గొంతు కోశారు. ప్రీతి భర్త రాహుల్ ఉరివేసుకుని మృతిచెందాడు. బంధువుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు రాహుల్ తన సూసైడ్ లేఖలో రాశారు.