హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రహదారులపై ప్రమాదాల నివారణకు ‘4ఈ’ (ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ సర్వీసెస్) వ్యూహాన్ని అవలంబించాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ఈ వ్యూహాన్ని పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ జాయింట్ సెక్రటరీ కమలేశ్ చతుర్వేది అన్ని రాష్ట్రాల రీజినల్ ఆఫీసర్లకు సూచించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ‘4ఈ’ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
పటిష్ఠమైన రహదారుల నిర్మాణం కోసం మట్టి నాణ్యతను పరిశీలిస్తారు. మూలమలుపులు లేకుండా రహదారి తిన్నగా ఉండేలా చూస్తారు. ఒకవేళ మూలమలుపులు తప్పనిసరి అయితే అవి ఒకదానికొకటి చాలా దూరంగా ఉండేలా డిజైన్ చేస్తారు. సైనేజ్‌లు, మార్కింగ్‌లు పక్కాగా ఉండేలా చర్యలు చేపడతారు. దీని వల్ల వాహనాన్ని నడిపే డ్రైవర్‌కు ఆ రోడ్డుపై వెంటనే అవగాహన ఏర్పడుతుంది.
ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా స్థానిక పోలీసులు ఇప్పటికే డ్రంకెన్ డ్రైవ్ కార్యక్రమాన్ని విస్త్రృతంగా చేపడుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారితోపాటు రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకొంటున్నారు. వారికి చలాన్లు విధించడం, లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా వాహనాలను సైతం సీజ్ చేస్తున్నారు. వాహనాల అతివేగానికి కళ్లెం వేసేందుకు రహదారులపై స్పీడ్ గన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనదారులకు భారీగా జరిమానా విధిస్తున్నారు.
రహదారి ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ సెన్స్‌పై విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించేలా చూస్తున్నారు. సీట్ బెల్టులు పెట్టుకోవడం వల్ల కార్లలో ప్రయాణించే వారికి లభించే రక్షణ గురించి తెలియజేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావాలంటే తప్పనిసరిగా సీటు బెల్టులు ధరించాలని, అప్పుడే ప్రాణాపాయం తప్పుతుందని వివరిస్తున్నారు.
ప్రమాదం జరిగిన గంట వ్యవధిలోగా క్షతగాత్రులను దవాఖానకు చేర్చి వైద్యం అందించగలిగితే ప్రాణాలను కాపాడే అవకాశాలు 90 శాతం మేరకు ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని 104, 108, 100 లాంటి అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఎమర్జెన్సీ సర్వీసులకు క్షతగాత్రులు వెంటనే ఫోన్ చేసేందుకు వీలుగా రహదారులపై ఎక్కడిక్కడ ఎస్వోఎస్లు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పలు జిల్లా దవాఖానల్లో ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
రహదారులపై వాహనదారులు, ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నాం. జాతీయ రహదారుల నిర్మాణంలో అత్యున్నత ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటిస్తున్నాం. మూలమలుపులు లేకుండా చర్యలు చేపడుతున్నాం.
– కృష్ణప్రసాద్, ఎన్హెచ్ఏఐ రీజినల్ డైరెక్టర్