
హైదరాబాద్, డిసెంబర్ 16: ఐటీ రంగ సంస్థ 3ఐ ఇన్ఫోటెక్.. హైదరాబాద్లోని హైటెక్ సిటీలోగల తమ కొత్త బీపీఎస్ విభాగం కోసం నియామకాలకు దిగనున్నది. రాబోయే రెండు నెలల్లో 500 మందిని ఉద్యోగాల్లోకి తీసుకునే దిశగా ప్రణాళికలు వేస్తున్నది. ఈ క్రమంలోనే నైపుణ్యం, ప్రతిభగల ఉద్యోగులను ఆకర్షించేందుకు ఇటు ఆఫ్లైన్లో, అటు సోషల్, డిజిటల్ వేదికల ద్వారా ఆన్లైన్లోనూ రిక్రూట్మెంట్కు దిగాలని చూస్తున్నది.
హైదరాబాదీలకే ప్రాధాన్యం తొలి దశ నియామకాల ప్రక్రియలో హైదరాబాద్ పరిధిలోనివారికే సంస్థ ప్రాధాన్యం ఇవ్వనున్నది. ప్రతిభావంతులైన స్థానిక యువతనే ఉద్యోగాల్లోకి తీసుకోనున్నది. తద్వారా ప్రాంతీయ మార్కెట్లో పట్టు సాధించాలన్నదే కంపెనీ వ్యూహం. తర్వాతి దశల్లో ఇతర ప్రాంతాల మార్కెట్లపై దృష్టి పెట్టనున్నది. అప్లికేషన్, ఆటోమేషన్, అనలిటిక్స్ సేవల విభాగాల్లో ఉద్యోగావకాశాలున్నాయి. రిటైల్, ఈ-కామర్స్, టెలికం, బీఎఫ్ఎస్ఐ, మీడియా, ఎంటర్టైన్మెంట్, తయారీ తదితర రంగాల్లో సంస్థకు కస్టమర్లున్నారు.
బ్రిటన్కు చెందిన బిజినెస్ ఫైనాన్షియల్ వేదిక టైడ్.. తమ హైదరాబాద్ టెక్నాలజీ సెంటర్ కోసం మరో 300 మందికిపైగా ఇంజినీర్లను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నది. రాబోయే ఏడాదిన్నర, రెండేండ్లలో ఈ నియామకాలను పూర్తిచేస్తామని గురువారం సంస్థ ప్రకటించింది. జావా, పైథాన్ ఇంజినీర్లతోపాటు డాటా సైన్స్, ఫ్లట్టర్ నిపుణులకు ప్రాధాన్యం ఇవ్వనున్నది. వచ్చే ఐదేండ్లలో వెయ్యికిపైగా ఉద్యోగులను తీసుకుంటామని ఇప్పటికే టైడ్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2026 చివరికల్లా 600లకుపైగా టెక్నాలజీ నిపుణులను నియమించుకుంటామని చెప్తున్నది. ఇందులో భాగంగానే హైదరాబాద్లో 300 మందికిపైగా తీసుకోనున్నది.