హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రైతుల నుంచి సేకరించిన భూమికి పరిహారంగా చెల్లించాల్సిన భారీ మొత్తాన్ని ఒక జిల్లా కోర్టు అధికారి తన భార్య పేరిట మళ్లించిన బాగోతంపై హైకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించింది. గద్వాల సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 2015-2022 మధ్యకాలంలో భూసేకరణ అధికారి డిపాజిట్ చేసిన రూ.3.08 కోట్లను అప్పటి కోర్టు అధికారి తన భార్య పేరిట మళ్లించడంతో బాధిత రైతులకు భూపరిహారం అందలేదని గుర్తించింది. పరిహారం చెల్లించకపోవడం సబబు కాదని పేర్కొన్నది. కోర్టు అధికారి చేసిన తప్పు వల్ల భూమిని కోల్పోయిన బాధిత రైతులు నష్టపోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆ మొత్తాన్ని నిందితుల నుంచి రాబట్టి తిరిగి కోర్టు బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు తక్షణమే చర్యలకు ఉపక్రమించాలని ఏసీబీని ఆదేశించింది.
ఈ సమస్యను కొలికి తేవాలని గద్వాల జిల్లా కోర్టు, ఏసీబీలను ఆదేశించింది. సమస్య శాశ్వత పరిషారానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని సూచించింది. పెండింగ్‌లో ఉన్న 120 చెకులను నిర్దిష్ట విధానంలో చట్టప్రకారం బాధిత రైతులకు సొమ్ము చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ర్యాలంపాడు బాలెన్సింగ్ రిజర్వాయర్ నిమిత్తం 2008లో సేకరించిన 7.12 ఎకరాల హకు వివాదాన్ని కోర్టులు తేల్చాయి. వడ్డీతో కలిపి రూ.18.22 లక్షలు చెల్లించాలన్న రైతుల వినతిని గద్వాల కోర్టు తిరసరించింది. దీనిని సవాలు చేస్తూ కే హనుమంతు అనే బాధితుడు హైకోర్టులో సవాలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు ద్విసభ్య ధర్మాసనం విచారించి కీలక తీర్పు చెప్పింది. పిటిషనర్‌కు మూడు నెలల్లోగా పరిహారం చెల్లించాలని తీర్పులో పేరొన్నది.
‘రికార్డులను పరిశీలిస్తే 2015-2022 మధ్యకాలంలో గద్వాల సీనియర్ సివిల్ కోర్టులో సీనియర్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన వై సత్యనారాయణ తన భార్య పేరుతో రూ.3.08 కోట్లకు చెక్కు మంజూరు చేసి కుంభకోణానికి తెర తీశారు. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ సామ్ కారణంగా 2022కు ముందున్న భూ పరిహారం చెక్కులను కోర్టు అనుమతించకపోవడం చట్ట వ్యతిరేకం. నిధుల మళ్లింపు చేశాక నిందితుడు సత్యనారాయణ రిజిస్టర్లు, డీఫారాలు మాయం చేశాడు. రికార్డులను తారుమారు చేశాడు. దీంతో బాధితులకు చెల్లింపులు నిలిచిపోయాయి.
ఇప్పుడు 120 చెక్కులకు చెందిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి చెల్లింపులకు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి. 2015-2022 మధ్య కుంభోణం, అంతకుముందు డిపాజిటైన పిటిషనర్ సొమ్మును ఏకపక్షంగా తిరసరించడం సబబుకాదు. భూసేకరణ అధికారి నుంచి డూప్లికేట్ డీఫారాలు, ట్రెజరీ నుంచి స్టేట్మెంట్, సీసీడీ రికార్డులను కోర్టు అధికారులు క్రోడీకరించాలి. గుమాస్తా, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ కౌంటర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని ఏడాదికోసారి హైకోర్టు రిజిస్ట్రార్ తనిఖీలు చేయాలి. బాధితులకు పరిహారం చెల్లించేటప్పుడు బాధితులతోపాటు వాళ్ల లాయర్ కూడా ధ్రువీకరణ తీసుకోవాలి. ఒకవేళ పరిహారం ఎకువ పొందితే తిరిగి చెల్లిస్తామని వాళ్ల నుంచి అఫిడవిట్ తీసుకోవాలి. ఏసీబీ డైరెక్టర్, దర్యాప్తు అధికారితో జిల్లా జడ్జి మాట్లాడి రికవరీ సొమ్మును సీసీడీ ఖాతాలో జమ చేసి బాధితులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. పరిహార రికార్డులను డిజిటలైజ్ చేయాలి. ఒక ప్రతిని హైకోర్టుకు అందజేయాలి. పిటిషనర్‌కు మూడు మాసాల్లో పరిహారం చెల్లించాలి’ అని హైకోర్టు తీర్పు వెలువరించింది.