న్యూఢిల్లీ, జనవరి 22: ఐఏఎస్ క్యాడర్ నిబంధనలు మార్చాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం లేఖ రాశారు. కేంద్రం తలపెట్టిన మార్పులు అస్థిరతా భావనను, గందరగోళాన్ని కలిగిస్తాయని, రాజకీయ జోక్యం వల్ల అధికారులు, ముఖ్యంగా ఎన్నికల సమయాల్లో, నిష్పాక్షికంగా పనిచేయలేరని ఛత్తీస్‌గఢ్ సీఎం తన లేఖలో పేర్కొన్నారు. తమ రాష్ట్రం ఈ సవరణలను వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. రాష్ర్టాల ఏకాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా అధికారులను పంపించే అధికారం సవరణల ద్వారా కేంద్రానికి దక్కుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధమని నొక్కిచెప్పారు. ప్రతిపాదిత సవరణలు ఐఏఎస్ వ్యవస్థను బలహీనపరుస్తాయని రాజస్థాన్ సీఎం గెహ్లాట్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, సమాఖ్య స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగ నిర్మాతలు అఖిల భారత సర్వీసులకు ప్రాణం పోశారని గుర్తుచేశారు. భారతదేశపు ఉక్కుచట్రంగా ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అభివర్ణించిన ఐఏఎస్ వ్యవస్థ సవరణలతో నీరుగారి పోతుందని హెచ్చరించారు. కేంద్ర ప్రతిపాదించిన సవరణలు నిరంకుశమని, వాటిని ఉపసంహరించుకోవాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ డిమాండ్ చేశారు.