న్యూఢిల్లీ: ఎన్ఆర్ఐ ఖాతా నుంచి అక్రమంగా డబ్బులు డ్రా చేసేందుకు యత్నించిన కేసులో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు సహా 12 మందిని ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించి ఎన్ఆర్ఐ ఖాతాను యాక్సెస్ చేసి.. మోసపూరితంగా చెక్‌బుక్ తీసుకొని నగదును ఉపసంహరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీటిని గ్రహించిన బ్యాంక్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూఎస్ మొబైల్ ఫోన్ నంబర్‌ను ఇండియన్ మొబైల్ నెంబర్‌తో యాక్సెస్ చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. ఇంటర్నెట్ బ్యాకింగ్ ఖాతాను యాక్సెస్ చేసేందుకు 66 సార్లు ప్రయత్నాలు జరిగాయని బ్యాంక్ తెలిపినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో 20 చోట్ల దాడులు నిర్వహించారు. ఈ నిందితులకు బ్యాంకు ఉద్యోగులు సైతం సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. చెక్ బుక్ జారీ చేయడంతో పాటు మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేయడం, అకౌంట్ ఫ్రీజ్ను బ్యాంకు ఉద్యోగులు తొలగించేందుకు యత్నించినట్లు చెప్పారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు సహా 12 మందిని అరెస్టు చేసినట్లు సైబర్ సెల్ డిప్యూటీ కమిషనర్ కేపీఎస్ మల్హోత్ర తెలిపారు. ఎన్ఆర్ఐ ఖాతా యాక్టివ్‌లో లేదని, అందులో పెద్ద ఎత్తున డబ్బులున్నాయని నిందితులకు తెలిసిందని పేర్కొన్నారు.
ఈ మేరకు వారికి ఎలా సమాచారం తెలిసిందనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. చెక్ బుక్ జారీ, అకౌంట్ ఫ్రీజ్ తొలగించేందుకు బ్యాంక్ ఉద్యోగికి రూ.10లక్షలు ఇవ్వడంతో పాటు బ్యాంక్ ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకునేందుకు రూ.15లక్షల బీమా కొనుగోలు చేస్తామని ఎర వేసినట్లు పోలీసులు చెప్పారు. గతంలో ఇదే ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నాలు జరిగాయని.. ఘజియాబాద్, మొహాలీలో రెండు కేసులు నమోదయ్యాయని పోలీసులు వివరించారు.