న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఐపీవో ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయిస్తుందని, మే నెల తొలివారంలో మార్కెట్లో ఆఫర్ జారీ అవుతుందని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఆఫర్ ద్వారా ప్రభుత్వం రూ. 21,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇష్యూకు సంబంధించిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి బుధవారంనాటికల్లా సమర్పిస్తామని, అదే రోజున ఇష్యూ తేదీలు, ఇష్యూ ధర, పాలసీ హోల్డర్లు, ఉద్యోగులకు రిజర్వేషన్లు, డిస్కౌంట్లు వెల్లడవుతాయని ఆ అధికారి వివరించారు.
నియంత్రణా సంస్థ అనుమతికి లోబడి మే తొలివారంలో ఎల్ఐసీ ఐపీవో ప్రారంభమవుతుందని వివరించారు. గత ఫిబ్రవరిలో సెబీకి ఎల్ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో 5 శాతం వాటాను (31.6 కోట్ల షేర్లు) ప్రభుత్వం విక్రయించనున్నట్టు తెలిపింది. తాజాగా దానిని 3.5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనకు శనివారం ఎల్ఐసీ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే ఇన్వెస్టర్ల స్పందనను అనుసరించి సంస్థ విలువను రూ. 6 లక్షల కోట్లుగా ఖరారు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు తలెత్తడంతో ఎల్ఐసీ ఆఫర్ పరిమాణాన్ని, విలువను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.