e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News 29% ఫిట్‌మెంట్‌!

29% ఫిట్‌మెంట్‌!

29% ఫిట్‌మెంట్‌!
 • రిటైర్మెంట్‌ వయసు పెంపు నెలాఖరు నుంచే
 • ప్రభుత్వోద్యోగులతోపాటు టీచర్లకూ వర్తింపు
 • సూత్రప్రాయంగా నిర్ణయించిన సర్కారు
 • ఔట్‌సోర్సింగ్‌, చిరుద్యోగులకూ వేతన లబ్ధి
 • పీఆర్సీపై ఈసారి అసెంబ్లీలోప్రకటన
 • 3 పదవీ విరమణ వయసు మూడేండ్లు పెంపు 

సందేహ రాయుళ్ల అపోహలను, అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వం మరోమారు సంచలన  నిర్ణయం తీసుకోబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌  మరోమారు తాను ఉద్యోగుల మిత్రుడినేనని చాటుకోబోతున్నారు. చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం అతి త్వరలో కీలక ప్రకటన వెలువరించనున్నది.ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయాలు తీసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు నమస్తే తెలంగాణకు తెలియజేశాయి. తెలంగాణ ఉద్యోగులు మరోసారి గర్వంగా కాలర్‌ ఎగరేసేలా ఈ నిర్ణయాలు ఉంటాయని ఆ వర్గాలు వెల్లడించాయి. 

హైదరాబాద్‌, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 29% ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించనున్నట్టు తెలిసింది. ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు (మూడేండ్లు) పెంచనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున.. కోడ్‌ ముగిసిన వెంటనే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్సీ ఇస్తారని విశ్వసనీయ వర్గాలు నమస్తే తెలంగాణకు తెలియజేశాయి. ఈ నెల 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పీఆర్సీ ప్రకటనచేస్తారని తెలుస్తున్నది. ఈ నెలాఖరునుంచి రిటైర్మెంట్‌ వయసు పెంపు వర్తించేలా చర్యలు తీసుకొంటున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన 27% ఐఆర్‌ కంటే తెలంగాణ ఉద్యోగులకు ఎక్కువగానే ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. 

తెలంగాణ ఉద్యోగులు గర్వపడేలా..

తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం ఏ విధంగా సిఫారసు చేసినప్పటికీ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు గౌరవప్రదంగా ఉండేలా ముఖ్యమంత్రి ఫిట్‌మెంట్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలంగా ఉన్న ఉద్యోగులతో మొదట్నుంచీ రాష్ట్ర ప్రభుత్వం మమేకమై ముందుకు వెళ్తున్నది. ఉద్యోగులు, తాము వేరుకాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా పలుమార్లు వెల్లడించారు. తెలంగాణ ఉద్యోగులు ఎప్పుడూ కాలరెగిరేసేలా ఉంటారని సీఎం ఎన్నోసార్లు చెప్పారు. ఉద్యోగులు.. ప్రభుత్వం కూడా సమన్వయంతో తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావించిన నెలరోజులలోపే ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్‌ను సీఎం అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటుచేసిన పదో వేతన సవరణ సంఘం 29% ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసినప్పటికీ.. ముఖ్యమంత్రి అత్యంత ఉన్నతంగా ఆలోచించి ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు. దీని గురించి ముఖ్యమంత్రిని ప్రశ్నించినప్పుడు.. ఉమ్మడి ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకుని తెలంగాణ ఉద్యోగులు 42 రోజులు సకల జనుల సమ్మెలో పాల్గొని, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరడంలో కీలకభూమిక వహించారని, అలాంటి ఉద్యోగులను ఎంతగానో గౌరవించుకోవడం బాధ్యతగా భావించి, సకల జనుల సమ్మెకు గుర్తుగా 43% ఫిట్‌మెంట్‌ను ఇస్తున్నామని ఆనాడు చెప్పిన విషయాన్ని ఉద్యోగ సంఘాలు గుర్తుచేసుకొంటున్నాయి. ఇప్పుడు కూడా ఉద్యోగులు గర్వపడేలా ఫిట్‌మెంట్‌ ఇస్తారని వారు నమ్మకంతో ఉన్నారు. 

చిరుద్యోగులకూ అదే పెంపు!

ఉద్యోగుల గురించి ఆలోచించిన ప్రతిసారీ సీఎం కేసీఆర్‌ ముందు చిరుద్యోగుల గురించే ఆలోచిస్తారు. వారి సంక్షేమం, అభివృద్ధి గురించి, గౌరవప్రదంగా ఉండేలా వేతనాల పెంపు గురించి ఆలోచిస్తారు. అందుకే రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులు, హోమ్‌గార్డులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను అనూహ్యంగా పెంచారు. ట్రాఫిక్‌ పోలీసులకు ప్రత్యేక అలవెన్సు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానస్థాయిలోనే వేతనాల పెంపును సీఎం ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. వీరికోసం పీఆర్సీ చేసిన సిఫార్సులనూ అమలుచేస్తారని తెలిసింది. 

మార్చి నుంచే రిటైర్మెంట్‌ వయసు పెంపు

రిటైర్మెంట్‌ వయసు 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. మార్చి చివరినాటికి కొందరు ఉద్యోగులు రిటైర్‌ అవుతారు కాబట్టి.. పదవీ విరమణ వయసు పెంపు వారికీ వర్తించేలా ఈ నెలనుంచే పెంపు నిర్ణయం అమలయ్యేలా చర్యలు తీసుకొంటున్నట్టు తెలిసింది. ఈ నిర్ణయం అమలైతే రానున్న మూడేండ్లలో రిటైర్‌ అయ్యే దాదాపు 30 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. మార్చిలో దాదాపు వెయ్యిమంది రిటైర్‌ కాబోతున్నారు. వీరందరికీ మరో మూడేండ్లు సర్వీసులో కొనసాగే అవకాశం లభిస్తుంది. 2021లో మార్చి నుంచి 9001 మంది, 2022లో 10,201 మంది, 2023లో 11 వేల మంది పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. వీరందరికీ రిటైర్మెంట్‌ వయసు పెంపు లబ్ధి చేకూరుతుంది. వీరిలో ఎక్కువమంది ఉపాధ్యాయులే.

మిన్నంటిన సంబురాలు

29% ఫిట్‌మెంట్‌!

సంగారెడ్డి మున్సిపాలిటీ, మార్చి 9ః ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో   రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు సంబురాలు చేసుకొన్నారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌ వద్ద పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకొన్నారు. టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని టీఎన్జీవోస్‌ భవన్‌ ఆవరణలో బాణాసంచా పేల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు సుశీల్‌బాబు మాట్లాడుతూ ఉద్యోగుల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పీఆర్సీ కోసం కృషి చేసిన టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింలు, రాష్ట్ర సభ్యుడు రవి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ, నిజామాబాద్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌ ప్రాంతాల్లోనూ ఉద్యోగులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకొన్నారు.

ప్రభుత్వాన్ని గెలిపించుకొంటాం 

మా సమస్యలపై ముఖ్యమంత్రిని కలిశాం. ప్రభుత్వంపై మాకు సంపూర్ణ విశ్వా సం ఉన్నది. గతంలో మేం అనుకున్నదానికన్నా ఎక్కువే ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. ఈసారి కూడా అదేవిధంగా ఉంటుందని భావిస్తున్నాం. ఏపీ కంటే అదనంగా పీఆర్సీ ఇస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆయన అన్నమాటపై నిలబడతారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలన్నీ ఎన్నికల కోడ్‌ ముగియగానే పరిష్కరిస్తూ ఆదేశాలు జారీచేస్తామన్నారు. మేమంతా రాష్ట్ర ప్రభుత్వం వెంటే ఉంటాం.  మేం అడిగిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.

-మామిళ్ల రాజేందర్‌, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌, టీఎన్జీవో అధ్యక్షుడు

ఉద్యోగుల కష్టాలు తెలిసిన సీఎం 

ఉద్యోగుల కష్టనష్టాలు తెలిసిన పాలకుడు కేసీఆర్‌. ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం పై సంపూర్ణ విశ్వాసమున్నది.  తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో42  రోజులు  సకల జనుల సమ్మెకు గుర్తుగా 43% ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. ఇప్పుడు కూడా మంచి ఫిట్‌మెంట్‌ ఇస్తామన్నారు. ఏపీకంటే ఎక్కువగానే ఇస్తామని చెప్పారు. మేం అడిగిన వెంటనే గౌరవంగా అపాయింట్‌మెంట్‌ ఇచ్చి, మా సమస్యలన్నీ విని, సానుకూలంగా స్పందించారు.  సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్తున్నాం.

-మమత, టీజీవో అధ్యక్షురాలు

టీచర్ల పక్షాన సీఎంకు కృతజ్ఞతలు

ఉపాధ్యాయులకు మంచి పీఆర్సీ ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఉపాధ్యాయులను స్థానిక సంస్థల్లో కలిపే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేదు. ఆయనపై మాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది. ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయసు పెంపును ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ఉపాధ్యాయుల పక్షాన కృతజ్ఞతలు. 

– శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు 

వీఆర్వోలను గుర్తించిన సీఎంకు కృతజ్ఞతలు

 • గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం 

హైదరాబాద్‌, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉన్న వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తూ, అర్హులైనవారికి ప్రమోషన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీపై తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం హర్షం వ్యక్తంచేసింది. వీఆర్వోల శ్రమ, కృషిని గుర్తించిన కేసీఆర్‌కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్‌, ప్రధాన కార్యదర్శి పల్లెపాటి నరేష్‌ కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం నిర్ణయానికి కట్టుబడతాం 

 • ఇంటర్‌ విద్య జేఏసీ

ఉద్యోగస్తుల పదవీ విరమణ వయస్సు పెంపు, పీఆర్సీపై సీఎం కేసీఆర్‌ స్పష్టత ఇవ్వడం హర్షణీయమని ఇంటర్‌విద్య జేఏసీ పేర్కొన్నది. ఉద్యోగుల శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయమని సంఘం చైర్మన్‌ పీ మధుసూదన్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ కళింగ కృష్ణకుమార్‌ తెలిపారు. ఇది ఉద్యోగ స్నేహిత ప్రభుత్వమని మరోసారి నిరూపించిందన్నారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్‌ తీసుకునే ప్రతి నిర్ణయంలో వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు.  

ఉద్యోగుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్‌

 • టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి

ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్‌ అని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. ఉద్యమ కాలంనుంచి ఇప్పటివరకు తమ వెంటే ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారని కొనియాడారు. ఇప్పుడు కూడా తమ వెంటే ఉన్నారని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తారనే నమ్మకం ఉన్నదని పేర్కొన్నారు. 

సీఎంతో మాది పేగుబంధం

 • పరిటాల సుబ్బారావు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ (వరంగల్‌)

తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో మాకు పేగు బంధం ఉన్నదని వరంగల్‌ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ పరిటాల సుబ్బారావు తెలిపారు. పదవీ విరమణ వయసు 61 ఏండ్లు చేయడం, పీఆర్సీపై స్పష్టత ఇవ్వడంపై హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఉంటుందని పేర్కొన్నారు. 

ఉద్యోగుల వెంటే కేసీఆర్‌

 • తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మార్త రమేశ్‌

తెలంగాణ రాక ముందునుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగుల వెంటే ఉన్నారు. ఎన్నికల కోడ్‌ అయిపోగానే పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు పెంపు మొదలైన సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీఇచ్చిన ఆయనకు కృతజ్ఞతలు. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ శ్రేయస్సుకు కట్టుబడిన ప్రభుత్వమని మరోసారి నిరూపితమైంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
29% ఫిట్‌మెంట్‌!

ట్రెండింగ్‌

Advertisement