బీజింగ్, జనవరి11 : వ్యాయామానికి బానిసైన 23 ఏండ్ల ఓ యువతికి రుతుస్రావం ఆగిపోయింది. తూర్పు చైనాకు చెందిన ఆ యువతిలోని హార్మోన్ల స్థాయిలు.. వయసు పైబడిన (50 ఏండ్లు) మహిళల మాదిరిగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వార్తా కథనం సోషల్‌మీడియాలో సంచలనంగా మారింది. జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఆ యువతి వైద్య పరీక్షల్లో హార్మోన్ల స్థాయిలు వైద్యుల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి.
వ్యాయామాన్ని వెంటనే నిలిపివేయాలని, సంప్రదాయ చైనా మందులను వాడాలని వైద్యులు ఆమెకు సూచించారు. ‘శరీరంలోని శక్తి సంక్షోభంలో పడితే, పునరుత్పత్తి విధులను శరీరం తాత్కాలికంగా వాయిదా వేస్తుంది’ అని జెజియాంగ్ దవాఖాన గైనకాలజిస్ట్ ఫాన్ ఇబింగ్ అన్నారు. విపరీతంగా తినటం వల్ల బరువు పెరగటంతో, బరువు తగ్గించుకోవాలని ఆ యువతి వ్యాయామం మొదలుపెట్టింది. వారానికి ఆరుసార్లు, ఒక్కోసారి సుమారు 70 నిమిషాలపాటు కఠినమైన వ్యాయామం చేయటం ఆమెకు అలవాటుగా మారింది.