చిత్రదుర్గ, జనవరి 11 : ‘నీకేమో ఇద్దరు భార్యలు కావాలి. 35 ఏండ్లు వచ్చినా నాకు మాత్రం పెండ్లి చేయవా? నాకు పెండ్లాం అవసరం లేదా?’ అంటూ తనకు పెండ్లి చేయలేదన్న కోపంతో ఒక వ్యక్తి తన తండ్రిని కొట్టి చంపిన ఘటన కర్ణాటకలో జరిగింది. ఈ దారుణం చిత్రదుర్గ జిల్లా హోసదుర్గలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారంటి సన్ననింగప్ప రెండు పెండ్లిండ్లు చేసుకున్నాడు. అయితే 35 ఏండ్లు వచ్చినా తనకు వివాహం చేయడం లేదని అతని కుమారుడు నింగరాజ తండ్రిపై కోపంతో రగిలిపోతుండే వాడు.
ఈ క్రమంలో ఇంట్లో తరచూ గొడవలవుతూ ఉండేవి. బుధవారం రాత్రి భోజనాల వద్ద తండ్రీ కొడుకులిద్దరికీ వాగ్వాదం జరిగింది. తండ్రిని చంపుతానని బెదిరించిన నింగరాజు, అదే రోజు రాత్రి నిద్రపోతున్న తండ్రిని ఇనుప రాడ్తో కొట్టి హత్య చేశాడు. అయితే నింగరాజు పొలం పనులకు కూడా సరిగ్గా వెళ్లకుండా ఇంట్లో సోమరిలా పడి ఉండేవాడని, అందుకే అతడికి వివాహం చేయలేదని మృతుడి మరో కుమారుడు మారుతి తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.