హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)లో దీర్ఘకాలంగా డిప్యుటేషన్లపై పనిచేస్తున్నవారు కింగ్మేకర్లుగా తయారయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్డదారిలో ఇన్చార్జి పోస్టు ల్లో చేరారని సొసైటీ సిబ్బంది కోడై కూస్తున్నది. ఇదిలావుండగా అక్రమాలను సక్రమం చేసుకునేందుకు సిద్ధమయ్యారని సొసైటీ ఉద్యోగ, ఉ పాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకోసం రెగ్యులర్ ప్రమోషన్ల ప్రక్రియనే అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతూ సొసైటీని భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి దీనిపై దృష్టిసారించాలని డిమాండ్ చేస్తున్నాయి.
పట్టింపులేని సర్కార్
ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీ 2, జాయింట్ సెక్రటరీ 5, డిప్యూటీ సెక్రటరీ 6, రీజినల్ కో ఆర్డినేటర్ 10, అసిస్టెంట్ సెక్రటరీ 5 పోస్టులు మంజూరయ్యాయి. ఆయా పోస్టులను ఏ ప్రాతిపదికన భర్తీచేయాలనేదానిపై స్పష్టమైన మార్గదర్శకాలను 2017లోనే ప్రభు త్వం జారీచేసింది. ప్రస్తుతం ఆ మార్గదర్శకాలకు తిలోదకాలిస్తూ సొసైటీలో డిప్యుటేషన్లపై కీలక స్థానాలను అప్పగించారు. వాస్తవంగా సొసైటీకి సంబంధించి అకాడమిక్, అడ్మినిస్ట్రేషన్ కలిపి 2 అడిషనల్ సెక్రటరీ పోస్టులను డిప్యుటేషన్‌పై భర్తీచేసుకోవచ్చు. ఇందులో ఫైనాన్స్ కూడా ఒకటి. ఇక 5(జేఎస్) పోస్టుల్లో 3 పోస్టులను సొసైటీలో సీనియర్ డిప్యూటీ సెక్రటరీలకు పదోన్నతి ద్వారా, మిగతా 2 పోస్టులను డిప్యుటేషన్ ద్వారా భర్తీచేయాలి. మిగతా పోస్టులన్నింటినీ కూడా సొసైటీ నిబంధనల మేరకు పదోన్నతుల ద్వారా భర్తీ చేయా లి. కానీ, జేఎస్ పోస్టులన్నింటినీ సీనియారిటీ తో సంబంధం లేకుండా సొసైటీ సిబ్బందితో నే, అదీ డిప్యుటేషన్‌పై ప్రధాన కార్యాలయం లో అక్రమమార్గంలో తిష్ఠవేసిన వారితో భర్తీచేయడం గమనార్హం. నిబంధనల మేరకు ప్రిన్సిపాల్‌గా మూడేండ్ల అనుభవం కలిగిన వారినే జాయింట్ సెక్రటరీగా నియమించాలి. ఆ నిబంధనలకు పాతరేసి సీనియర్లను పక్కనపెట్టి ప్రధాన కార్యాలయంలో సుదీర్ఘంగా పాగావేసిన ఒకరిని జేఎస్గా నియమించడం కొసమెరుపు. అదేవిధంగా మరొక జేఎస్, డీఎస్ పోస్టులను సైతం భర్తీచేశారు. జోనల్ ఆఫీసర్ పోస్టులను సైతం ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు. నష్టపోయిన పలువురు ప్రిన్సిపాళ్లు నిజాలను వెలుగులోకి తెచ్చినా ప్రభు త్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
కుట్రపూరితంగా పదోన్నతుల నిలిపివేత
సొసైటీలో అడ్డదారిలో డిప్యుటేషన్లపై కొనసాగుతూ కీలకస్థానాలను ఆక్రమించినవారి హవా నడుస్తున్నది. తమ స్థానాలకు ఎసరొస్తుందని కుట్రపూరితంగానే రెగ్యులర్ ప్రమోషన్ల ప్రక్రియను సైతం సుదీర్ఘకాలంగా అడ్డుకుంటున్నారని సొసైటీ ఉద్యోగులే చెప్తున్నారు. రెగ్యులర్ జేఎస్, డిప్యూటీ సెక్రటరీ, జోనల్ ఆఫీసర్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీచేస్తే అక్రమ మార్గంలో ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న వారు తప్పుకోవాల్సి వస్తుంది. ప్రస్తు తం డిప్యుటేషన్లు సైతం చట్టబద్ధంగా రద్దవుతా యి. ప్రమోషన్ల ప్రక్రియను కావాలనే జాప్యం చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
19న బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ మీటింగ్..
ఇదిలావుంటే ఎస్సీ గురుకుల సొసైటీకి సంబంధించి మార్గదర్శకాల రూపకల్పన, కీలక నిర్ణయాలన్నీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ మీటింగ్‌లో తీసుకుంటారు. ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి ఈ సమావేశానికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ నెల 19న సమావేశాన్ని ఏర్పాటుచేసేందుకు సొసైటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం సైతం సంబంధిత మంత్రి సమక్షంలో అసోసియేషన్ల బాధ్యులతో చర్చించనున్నట్టు తెలిసింది.
హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం..
గడిచిన 25 నెలలుగా సొసైటీలో కల్పించిన ప్రమోషన్లు, బదిలీలు, విధానపర నిర్ణయాలన్నింటినీ సమీక్షించాలని, లోపాలను సవరించాలని, అప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. హెడ్ ఆఫీసులోని డిప్యుటేషన్లన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిబ్బంది అవసరమైతే కొత్తగా ఇంటర్వ్యూ, సీనియారిటీ ఆధారంగా, గరిష్ఠంగా 3 ఏండ్లపాటు మాత్రమే అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. డిగ్రీ కాలేజీల పర్యవేక్షణ సీనియర్ అధికారికి అప్పగించి, జాయింట్ సెక్రటరీ పోస్టును అర్హులతో భర్తీ చేయాలని, వర్క్‌లోడ్‌కు అనుగుణంగా గురుకులాల్లో సిబ్బందిని కేటాయించాలని కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని సొసైటీ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.