న్యూఢిల్లీ, జనవరి 11 : రోజూ కనీసం ఏడు గంటల కన్నా తక్కువ నిద్రిస్తే ఆయుర్దాయం క్షీణిస్తుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. కనీసం ఏడు గంటలు నిద్రపోతే ఆయుష్షు పెరుగుతుందని, మధుమేహం, గుండె సమస్యలు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధకులు గుర్తించారు. అమెరికా రాష్ర్టాల్లో ఆయుర్దాయంకు సంబంధించిన సర్వే నమూనాలను ‘ఒరెగాన్ హెల్త్, సైన్స్ వర్సిటీ’ పరిశోధకులు విశ్లేషించారు. దీర్ఘాయువుతో ముడిపడిన జీవనశైలి అంశాల్ని విశ్లేషించగా, ‘నిద్ర’ బలమైన అంశంగా నిర్ధారించారు.
రోజూ తినే ఆహారం, శారీరక శ్రమ, సామాజికంగా ఒంటరితనం.. అనే వాటి కన్నా ‘నిద్ర’ బలమైనదిగా తేల్చారు. ‘నిద్ర.. ఆయుర్దాయంతో బలమైన సంబంధం కలిగి ఉంటుందని ఊహించలేదు. కానీ.. మా అధ్యయనం ఆ విషయాన్ని నొక్కి చెప్పింది. ప్రజలు 7 నుంచి 9 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించాలి’ అని పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ ఆండ్రూ మెక్హిల్ అన్నారు. సరిపడా నిద్ర లేకపోతే మెదడు, రోగ నిరోధక వ్యవస్థ, జ్ఞాపకశక్తి, శారీరక ఆరోగ్యం సహా అనేక ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదని అధ్యయనం పేర్కొన్నది.