
కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఉమ్మడి జిల్లా వాసులు గత ఏడాదిని అభివృద్ధి నామ సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు. 2021లో చేపట్టిన కొత్త ప్రాజెక్టులు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల రూపురేఖలు మార్చనున్నాయి. రీజినల్ రింగురోడ్డుతో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం ఉరుకులు పెడుతుండగా, పారిశ్రామిక ప్రగతితో యువతకు పెద్దసంఖ్యలో ఉపాధి లభిస్తున్నది. కలెక్టరేట్లు కొత్త సొబగులతో ముస్తాబవుతుంటే, బుల్లెట్ ట్రెయిన్ పరుగులతో వికారాబాద్ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనున్నది. మరోవైపు అనంతగిరిని టూరిజం హబ్‌గా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ఆ ప్రాంతం మరిన్ని సొబగులు అద్దుకోనున్నది. ఇటు ఇబ్రహీంపట్నం, అటు తాండూరు ప్రాంతాలు కొత్త పరిశ్రమలతో కళకళలాడుతున్నాయి. వెల్స్పన్, కటేరా, అమెజాన్ లాంటి ప్రతిష్టాత్మక పరిశ్రమలతో ఇబ్రహీంపట్నం ఇండస్ట్రీస్ హబ్‌గా మారింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో పల్లెలు కూడా పట్నాలకు దీటుగా అభివృద్ధి చెందడంతో స్వంత గ్రామాలకు తిరిగివచ్చిన వారితో కళకళ లాడుతున్నాయి. ప్రగతి ఫలాలు ప్రతి ఊరిని, ప్రతి ఇంటినీ చేరడంతో పాటు, పల్లె నుంచి పట్నం వరకు అభివృద్ధితో కళకళలాడుతుండడంతో జిల్లా వాసులు అంతే ఉత్సాహంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. – రంగారెడ్డి, డిసెంబర్ 31, (నమస్తే తెలంగాణ)
పరిగి, డిసెంబర్ 31 : 2021 వికారాబాద్ జిల్లాకు చాలా గుర్తులనే మిగిల్చిందని చెప్పవచ్చు. నూతన జిల్లా ఏర్పాటైంది. సకాలంలో వర్షాలు కురిసి చెరువులన్నీ నిండి వ్యవసాయ వృద్ధికి దోహదపడింది. జిల్లా ప్రజలకు మేలు కలిగే అనేక నిర్ణయాలకు ఈ ఏడాది వేదికగా నిలిచింది.
జిల్లాకు మెడికల్ కళాశాల
వికారాబాద్ జిల్లాకు 2023-24 సంవత్సరంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు సర్కారు నిర్ణయించింది. తద్వారా ఆర్థికంగా వెనుకబడిన ఈ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి రానున్నది. దానికి అనుబంధంగా 330 బెడ్ల దవాఖాన ఏర్పాటు కానుండడంతో వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.
దేశంలోనే నం.1గా డయాగ్నస్టిక్ సెంటర్..
వికారాబాద్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ డయాగ్నస్టిక్ సెంటర్ దేశంలోనే నం.1 స్థానంలో నిలిచింది. 32 దవాఖానల నుంచి రక్త నమూనాలు సేకరించి వెంటనే ఫలితాలు తెలియజేయడం వల్ల దేశంలోనే వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు నంబర్ వన్ స్థానం దక్కింది. రూ.3.50 కోట్లతో జూన్ 9న డయాగ్నస్టిక్ సెంటర్‌ను విద్యా శాఖ మంత్రి ప్రారంభించారు. డిసెంబర్ 30వ తేదీ వరకు ఈ కేంద్రం నుంచి 12,650 మంది రోగులకు సంబంధించి 21,491 రక్త నమూనాలు సేకరించి 31,233 వైద్య పరీక్షలు చేశారు. తాండూరులోని జిల్లా దవాఖాన ప్రసవాల్లోనే రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ దవాఖానలో పది నెలల్లో 5,103 ప్రసవాలు జరిగాయి. దీంతోపాటు తాండూరులో రూ.20కోట్ల వ్యయంతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ప్రత్యేకంగా సిక్ న్యూ బర్న్ కేర్ యూనిట్, న్యూట్రిషనల్ రిహాబిలిటేషన్ సెంటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తద్వారా మాతాశిశు మరణాల సంఖ్య తగ్గేలా కేంద్రం దోహదం చేస్తున్నది.
రంగారెడ్డి, డిసెంబర్ 31, (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది జిల్లాకు కలిసొచ్చింది. పారిశ్రామిక రంగానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. దేశంలో ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దేశంలోనే రెండో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పార్కును జిల్లాలో ఏర్పాటు చేసేందుకు సంబంధిత సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. కిటెక్స్, మలబార్ వంటి పరిశ్రమలు ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. సీఎం కేసీఆర్ మానసపుత్రిక రీజినల్ రింగ్‌రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యం రద్దీగా మారిన బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకూ నిధులు మంజూరయ్యాయి. అప్పా-మన్నెగూడ వరకు బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరలోనే చేపట్టనున్నారు. అర్బన్ ప్రాంతంలో ముంపు ఏర్పడకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. జిల్లా నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణం దాదాపు పూర్తికాగా, త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
భారీగా పెట్టుబడులు..
రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఎన్నో ఇండస్ట్రీయల్ పార్కులు, హార్డ్‌వేర్ పార్కులు, ఐటీ టవర్స్, మెగా ఉత్పత్తి పరిశ్రమలు వచ్చాయి. దేశంలోనే ప్రముఖమైన పరిశ్రమలు వెల్స్పన్, క్రోనస్, టాటా, విజయ్‌నేహా, నాట్కో ఫార్మా, రెనెసిస్, కాస్పర్, విప్రో, ఎంఎస్ఎన్లాంటి ప్రముఖ పరిశ్రమల ప్లాంట్లను జిల్లాలో నెలకొల్పారు. షాబాద్ మండలంలోని చందన్వెల్లి, సీతారాంపూర్లలో రూ.1200 కోట్లతో కిటెక్స్, రూ.750 కోట్లతో మలబార్, రూ.800 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాల పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతోపాటు ప్రభుత్వం భూములను కేటాయించింది. మరోవైపు బాటసింగారంలో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కును 2 లక్షల గ్రే హౌస్ స్పేస్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
నూతన మండలం.. మరో మండలానికి నోటిఫికేషన్
వికారాబాద్ జిల్లాలో మొత్తం 18 మండలాలుండగా ఈఏడాదిలో పరిగి నియోజకవర్గంలో చౌడాపూర్ మండలం ఏర్పాటైంది. మరో మండలంగా కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాలను ఏర్పాటు చేసేందుకు సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్లోకి మార్చింది.
ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ జాబితాలో వికారాబాద్ మున్సిపాలిటీ..
వికారాబాద్ మున్సిపాలిటీ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ జాబితాలో చోటు దక్కించుకున్నది. గడిచిన సంవత్సరం ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో ఉన్న వికారాబాద్ మున్సిపాలిటీ 2020-21 సంవత్సరానికి ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌లో చేరింది. బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా, అన్ని ఇండ్లకు మరుగుదొడ్లు, అవసరం మేరకు పబ్లిక్ టాయిలెట్లు, ఇతర సదుపాయాలు కేంద్ర బృందం పరిశీలించిన తర్వాత వారు ఇచ్చిన నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్, ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌లో ఉన్న మున్సిపాలిటీలను ప్రకటిస్తున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా వికారాబాద్‌కు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్, తాండూరు, కొడంగల్ మున్సిపాలిటీలకు ఓడీఎఫ్ ప్లస్‌లో చోటు లభించింది.
జిల్లాకు 3,873 ఇండ్లు మంజూరు..
వికారాబాద్ జిల్లాకు 3,873 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయి. చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్ మండలానికి 228, పరిగి నియోజకవర్గానికి 510, పరిగి పట్టణ శివారులో 300, మండలాల్లో 210, కొడంగల్‌కు 373 ఇండ్లు మంజూరు కాగా, కొడంగల్ పట్టణ పరిధిలో 300, గ్రామీణ ప్రాంతాల్లో 73, తాండూరు నియోజకవర్గానికి 1761, తాండూరు పట్టణ పరిధిలో 1001, గ్రామీణ ప్రాంతాల్లో 760 ఇండ్లు మంజూరయ్యాయి. వికారాబాద్ నియోజకవర్గానికి 1001 ఇండ్లు మంజూరు కాగా, పట్టణ ప్రాంతంలో 401, గ్రామీణ ప్రాంతాల్లో 600 ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. జిల్లాలో 1893 ఇండ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉండగా, మొదటగా పరిగి నియోజకవర్గంలోని అడవి వెంకటాపూర్ గ్రామంలో 30 ఇండ్ల నిర్మాణం పూర్తయింది.
‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ పైలెట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక..
వికారాబాద్ జిల్లాకు 2021 అచ్చి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ కార్యక్రమానికి పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాను ఎంపిక చేసింది. సెప్టెంబర్ 11న కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లు వికారాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆకాశ మార్గంలో మందులు, టీకాలు డ్రోన్లతో తరలించే ట్రయల్ రన్స్ చేపట్టారు. ఈ కార్యక్రమంతో వికారాబాద్‌కు ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
బుల్లెట్ ట్రైన్‌తో ప్రయాణం మరింత వేగంగా..
తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ (హై స్పీడ్ రైల్) కారిడార్ సాకారం కాబోతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నవంబర్ 25న వికారాబాద్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి ముంబాయికి (649.76 కిలోమీటర్ల దూరం) మూడు గంటల వ్యవధిలో ప్రయాణికులను చేరవేస్తున్నది. రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్ జిల్లా మీదుగానే ఎక్కువ దూరం బుల్లెట్ ట్రైన్ కారిడార్ కొనసాగుతున్నది. వికారాబాద్ పట్టణ శివారులోని ఆలంపల్లిలో బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్ ఏర్పాటు జరగనున్నది. జిల్లాలో 68.5 కిలోమీటర్ల నిడివి ఈ రైలు మార్గం ఉంటుంది. ఈ రైలు మార్గం నిర్మాణానికి 124.43 హెక్టార్ల భూమి అవసరమని సంబంధిత సంస్థ గుర్తించింది.
పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల..
జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సాగునీటికి రూపకల్పన చేసింది. గత ఆగస్టు 10న పరిగిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ప్రాజెక్టు నుంచి జిల్లా పరిధిలోని 417 గ్రామాల్లో 3,41,952 ఎకరాల భూమికి సాగునీరు అందనున్నది. రెండేండ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్నదే సర్కారు లక్ష్యం.
ప్రారంభానికి సిద్ధంగా కలెక్టరేట్..
వికారాబాద్ కలెక్టరేట్ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. రూ.42 కోట్లు వెచ్చించి అన్ని శాఖలు ఒకేచోట ఉండేలా నిర్మించారు. కలెక్టరేట్ సమీపంలోనే హెలిపాడ్ ఏర్పాటు చేశారు. నెల రోజుల్లో ప్రారంభం కానున్నట్లు తెలిసింది.
అనంతగిరి.. అభివృద్ధి..
తెలంగాణ ఊటీగా పిలువబడే 1505 హెక్టార్లలో విస్తరించిన అనంతగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కారు ముందుకు సాగుతున్నది. ఇక్కడికి ఇతర రాష్ర్టాల భక్తులూ వస్తుంటారు. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రోప్‌వే, ట్రెక్కింగ్ చేయడానికి ఏర్పాట్లు చేపట్టనున్నారు.
రీజినల్ రింగ్‌రోడ్డుకు గ్రీన్‌సిగ్నల్..
సీఎం కేసీఆర్ మానసపుత్రిక రీజినల్ రింగ్‌రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఔటర్ రింగ్‌రోడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాతోపాటు మరో మూడు జిల్లాల మీదుగా రీజినల్ రింగ్‌రోడ్డును నిర్మించనున్నారు. రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణం, భూసేకరణకుగాను మొత్తం రూ.12 వేల కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ నిధుల్లో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. అయితే 354 కి.మీ మేర నాలుగు లేన్లలో ప్రాంతీయ రింగ్‌రోడ్డు అందుబాటులోకి రానున్నది. జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకున్నది.
బీజాపూర్ రహదారి విస్తరణకు పచ్చజెండా..
జిల్లా మీదుగా వెళ్లే బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి టెండర్లకు సన్నద్ధం అవుతుండగా, త్వరలోనే పనులు షురూ కానున్నాయి. అయితే నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులకు సంబంధించి రూ.928.41 కోట్లతో రహదారి నిర్మాణం చేయనున్నారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ మేర బీజాపూర్ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు వెళ్లే జాతీయ రహదారి మధ్య 46 కి.మీ పరిధిలో ఆరు భారీ అండర్‌పాస్ బ్రిడ్జిలను, ఎనిమిది ప్రాంతాల్లో చిన్న అండర్‌పాస్ బ్రిడ్జిలను నిర్మించి అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాకుండా మొయినాబాద్ వద్ద 4.35 కిలోమీటర్ల మేర, చేవెళ్ల వద్ద 6.36 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. అంతేకాకుండా అంగడిచిట్టంపల్లి వద్ద 12 లేన్ల టోల్‌ప్లాజాను అందుబాటులోకి తీసుకురానున్నారు.
జిల్లాకు రెండు ఈఎస్ఐ దవాఖానలు..
జిల్లాకు రెండు ఈఎస్ఐ దవాఖానలు మంజూరయ్యాయి. జిల్లాలోని రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఈఎస్ఐ దవాఖాలను ఏర్పాటు చేయనున్నారు. సంబంధిత నియోజకవర్గాల్లోని శంషాబాద్, జల్పల్లిలో అనువైన స్థలాలను గుర్తించారు.
మున్సిపాలిటీల్లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు…
మున్సిపాలిటీల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇప్పటికే జిల్లాలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని మోడల్ మార్కెట్‌గా తీసుకొని రూ.1.10 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయగా, మిగతా మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లకు సంబంధించి స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలోనే జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలోనూ ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించనున్నారు.
ముంపు సమస్య పరిష్కారానికి రూ.348 కోట్లు..
జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో వరద ముంపు సమస్యను పరిష్కరించేందుకుగాను రూ.348 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలోని ఎల్బీనగర్ నియోజకవర్గానికి రూ.113.59 కోట్లు, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి రూ.57.74 కోట్లు, మహేశ్వరం నియోజకవర్గానికి రూ.94.41 కోట్లు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి రూ.32.42 కోట్లు, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి రూ.50.68 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
కొత్తపల్లికి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్..
జిల్లాలో నాలుగు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలను పంపగా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యాచారం మండలం కొత్తపల్లిలోని 334 ఎకరాల్లో, ఇబ్రహీంపట్నం మండలంలోని ఖానాపూర్ పరిధిలో 404 ఎకరాలు, మంచాల మండలం తాళ్లపల్లిగూడ పరిధిలోని 473 ఎకరాలు, కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్ గ్రామ పరిధిలో 330 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు.
త్వరలో అందుబాటులోకి కలెక్టరేట్…
జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ త్వరలో అందుబాటులోకి రానున్నది. కలెక్టరేట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 300లోని 28 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్లతో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించారు. వచ్చే ఏడాది సీఎం కేసీఆర్ నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు.