CM KCR Birthday Special | ఫ్రొఫెసర్ జయశంకర్ సారు మాటల్లో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షే ట్రిగ్గర్ పాయింట్. ఆ దీక్షతో తెలంగాణ వచ్చేసింది. అయితే సాంకేతికంగా కొంతకాలం ఆగింది. తెలంగాణ సాధనలో అత్యంత కీలకమైన నిరాహార దీక్ష రోజుల్లో కేసీఆర్ మనోభావమేంటి? అప్పుడు ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ‘నిమ్స్‌లో చోటు చేసుకొన్న భావోద్వేగ సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షిని నేను. ఆమరణ దీక్ష చేస్తున్న కేసీఆర్ పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకొందామన్న ఆసక్తితో విలేకరిగా ఆయనను కలుసుకుని ఇంటర్వ్యూ చేశాను. చావోరేవో అంటున్న కేసీఆర్, ఎంతటి తెగింపు, పట్టుదల ప్రదర్శించారో చూసిన ప్రత్యక్ష సాక్షిని నేను..’ అంటూ నాటి ఇంటర్వ్యూను మనతో పంచుకుంటున్నారు సీనియర్ పాత్రికేయుడు వెల్జాల చంద్రశేఖర్.
మీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు విషమంగా మారుతున్నది.. దీక్ష విరమించాలని వైద్యులు, ప్రభుత్వం కోరుతున్నది కదా?
ఇంతదాక వచ్చిన తర్వాత విరమిస్తే ఫలితమేంటి? ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. నేను చచ్చినా ఫర్వాలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే చాలని మానసికంగా, భౌతికంగా సిద్ధపడే నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు కూడా తెలంగాణ రాకపోతే వందేండ్లయినా రాదు. నా చావుతోనైనా తెలంగాణ వస్తే చాలన్న దృఢ సంకల్పంతో ఉన్నా.
దీక్ష విరమిస్తే ఆ తర్వాత అందరం కలిసి రాష్ర్టాన్ని సాధించుకొందామని మంత్రి అంటున్నారు కదా?
రాష్ట్రం ఇస్తామన్న ఒక మాటకు తప్ప దేనికీ అంగీకరించను. దీక్ష విరమించను.
ఇప్పటికే మీ ఆరోగ్యం బాగా క్షీణించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
6 రోజులుగా నిరాహార దీక్ష చేయటం వల్ల భౌతికంగా బలహీనపడవచ్చునేమో గానీ మానసికంగా మాత్రం బలహీనంగా లేను. నా ప్రాణాన్ని ఫణంగా పెట్టి దీక్షకు దిగితే తెలంగాణను ఇస్తారా? ఇవ్వరా? అనేది ఆలోచించటం లేదు. నేను బతికి ఉండగా తెలంగాణ ఇవ్వకపోతే, నేను చచ్చిన తర్వాతైనా తెలంగాణ ఇవ్వక తప్పదు కదా!
పోరాడి సాధించుకోవాలి తప్ప.. ప్రాణత్యాగానికి సిద్ధపడటం సమంజసమేనా?
నాకు చావంటే భయం లేదు. అన్నింటికీ సిద్ధపడే.. చివరికి ఈ నిర్ణయం తీసుకున్నా, నేను చచ్చినా ఒక లక్ష్యం కోసం, నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోసం చనిపోయానన్న ఆత్మ తృప్తి మిగులుతుంది. అది చాలు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కృతకృత్యులయినట్టు భావిస్తున్నారా?
తెలంగాణ రాష్ట్ర సాధనలో నేను కృతకృత్యుణ్ణి అయ్యానో లేదో ఇప్పుడు తెలియదు కానీ, తెలంగాణ కోసం పోరాడేందుకు లక్షల మంది కేసీఆర్‌లను తయారుచేశానన్న తృప్తితో హాయిగా కన్నుమూస్తా. తెలంగాణ రాష్ట్రం అనేది తన పరిధిలో లేని అంశమని, అలాంటప్పుడు తాను ఎలాంటి హామీ ఇవ్వగలనని సీఎం రోశయ్య అంటున్నారు.. శాసనసభలో తీర్మానం చేయటం ఆయన పరిధిలోని అంశమే కదా. సభలో తీర్మానం పెడితే వ్యతిరేకించేవాళ్లు ఎవరున్నారు? ప్రతిపక్ష టీడీపీ కూడా మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఇక్కడ సభలో తీర్మానంచేసి పంపిస్తే ఆ తర్వాత ఎలాగూ కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాన్ని ఇవ్వక తప్పదు కదా? శ్రీకాంతాచారి చనిపోయాడు.. (విషయాన్ని ప్రస్తావించగానే కేసీఆర్ భావోద్వేగానికి గురై కండ్ల నుంచి కన్నీళ్లు ధారలై పారాయి.) శ్రీకాంత్‌ను కడసారి చూడ్డానికైనా అనుమతించండి. ఉస్మానియాకు వెళ్లి వస్తానని అధికారులను ఎంతగా వేడుకొన్నా. వాళ్ల మనసు కరుగలేదు. (అంటూ కేసీఆర్ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి తమాయించుకొని) నా కన్నీటి బొట్లే శ్రీకాంత్‌కు నేను అర్పించే ఆశ్రు నివాళి.
(ఇంతలోనే డాక్టర్లు వచ్చి ప్లీజ్ మాట్లాడించవద్దని నన్ను వారించారు. దీంతో కేసీఆర్ నా వైపు చూస్తూ ఇక వెళ్లండన్నట్టు చేతులు జోడించి నమస్కరించారు)
అది 2009 డిసెంబర్ 4.. ఖమ్మం జైలు నుంచి ఆ ముందు రోజే (డిసెంబర్ 3 న) కేసీఆర్‌ను నిమ్స్‌కు తరలించారు. కేసీఆర్ అరెస్టుకు చలించి ఆత్మబలిదానానికి ఒడిగట్టిన శ్రీకాంతాచారి.. మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. ఒక వైపు హైదరాబాద్‌కు తరలించిన కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతున్నది. వైద్యుల హెచ్చరిక, మరో వైపు శ్రీకాంతాచారి మృతితో తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్త, ఉద్విగ్న, తుఫాన్ ముందటి వాతావరణం. తెలంగాణ నలుమూలల నుంచి వేలాదిగా ఉద్యమకారులు హైదరాబాద్‌కు తరలిరావటం మొదలైంది. అప్రమత్తమైన ప్రభుత్వం నిమ్స్ వెలుపల బారికేడ్లు, ముండ్ల కంచెలు పెట్టించి, సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ ముఖ్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఆ సమయంలో అప్పటి, ఉమ్మడి ఏపీ సీఎం రోశయ్య తెలంగాణ మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. కేసీఆర్‌ను దీక్ష విరమింప చేయకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికతో కేసీఆర్‌కు నచ్చజెప్పి దీక్ష విరమింపచేయాలని నిర్ణయించారు. అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి దానం నాగేందర్‌ను నిమ్స్‌కు వెళ్లాలని రోశయ్య ఆదేశించారు. దానం నిమ్స్‌కు వసున్నట్టు టీవీ చానల్స్‌లో బ్రేకింగ్స్ రావటంతో దవాఖాన వద్ద పెద్దఎత్తున మోహరించిన మీడియా అప్రమత్తం అయింది. కానీ నిమ్స్ వెనుకగేటు నుంచి దానం వచ్చినట్టు హాస్పిటల్ ఆవరణలో ఉన్న కేసీఆర్ కూతురు కవితకు సమాచారం వచ్చింది. ఆమె హడావుడిగా లోపలికి వెళ్లటాన్ని గమనించి, నేను కూడా ఆమె వెంట రెండో అంతస్తులో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్న రూమ్ నంబర్ 228లోకి వెళ్లా. అప్పటికే అకడికి దానం నాగేందర్ చేరుకున్నారు. కవిత వెంట రావడంతో ఆమె తాలూకు వ్యక్తే అయ్యి ఉండవచ్చని భావించి సెక్యూరిటీ సిబ్బంది నన్ను అడ్డుకోలేదు. అలా చాకచక్యంగా వెళ్లి నిమ్స్‌లో కేసీఆర్‌ను ఇంటర్వ్యూ చేసిన ఏకైక జర్నలిస్టును నేనే. ఇది నా కెరీర్లో గర్వించదగ్గ అంశం.
కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్న మంచం పక్కనే మంత్రి దానం నాగేందర్ నిల్చొని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాదరావు, చికిత్స అందిస్తున్న డాక్టర్లతో చర్చిస్తున్నారు. కేసీఆర్ దీక్ష విరమించకపోతే పరిస్థితి విషమంగా మారే ప్రమాదం ఉన్నదని, షుగర్, బీవీ స్థాయిలు పడిపోతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్లతో మాట్లాడాక మంత్రి నాగేందర్.. ‘విన్నారా అన్నా. దీక్ష విరమించకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్తున్నారు. ఒక మంత్రిగా చెప్పట్లేదు. ఒక తమ్ముడిగా అడుగుతున్నా. దీక్ష విరమించండి. మీరు, మేము, మనందరం కలిసి రాష్ర్టాన్ని తెచ్చుకుందాం. నా చేతిలో ఏమీలేదని, అలాంటప్పుడు నేనెలా హామీ ఇవ్వగలనని సీఎం రోశయ్య అంటున్నారు. మీవల్లే మాకు ఇంతో అంతో గౌరవం. మీ వల్లే మాకు ఈ గుర్తింపు. లేకపోతే మమ్మల్ని ఎవరు దేక్తరు? ఈ ఒకసారికి నా మాట వినండి’ అంటూ నాగేందర్ రెండు చేతులు జోడించి వేడుకున్నారు. మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్న కేసీఆర్ రెండు చేతులు జోడించి ‘ఆయన పరిధిలో ఉన్నదే చెయ్యమను. అసెంబ్లీలో తీర్మానం చేయటానికైతే ఇబ్బంది లేదుగా’ అని నిసత్తువ స్వరంతో ప్రశ్నించారు. ‘ఆయన తన చేతిలో లేదంటున్నారు. మీరు మరోసారి ఆలోచించండి. డాక్టర్లు ప్రమాదమంటున్నారు’ అని దానం అనగా, చేతికి స్లైన్ బాటిల్ పైప్‌లు ఉండటంతో ఛాతిపై రెండు చేతులు ఉంచుకొని దండం పెడ్తూ కేసీఆర్ తల అడ్డంగా ఊపారు. మంత్రి దానం తిరిగి వెళ్తూ అకడే నిల్చొని ఉన్న కవిత వైపు చూస్తూ ‘మీరైనా సముదాయించండి’ అని సూచిస్తూ వెళ్లిపోయారు.ఆ తర్వాత కేసీఆర్‌తో అక్కడే ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు లభించింది.
ఆరోజు నిమ్స్ దవాఖానలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కేసీఆర్‌ను చూడటానికి వచ్చిన కూతురు కవిత వైపు చూస్తూ ‘రావద్దంటే మళ్లీ ఎందుకు వచ్చావు’ అన్నట్టు కంటి సైగతోనే ప్రశ్నించారు. సమాధానం చెప్పకుండానే కవిత కన్నీళ్లతో ఆ గదికి ఆనుకొని ఉన్న మరో గదిలోకి (వీఐపీ రూమ్‌లో రెండు గదులు ఉన్నాయి) వెళ్లిపోయారు. ఆమె లోపలికి వెళ్లగానే కేసీఆర్ మా వైపు చూస్తూ ‘కండ్ల ముందు పిల్లలు కనిపిస్తే.. చావడానికి సిద్ధమైన నా మనసు మారవచ్చు. మరో ఆలోచన రాకూడదనే వారిని హాస్పిటల్‌కు రావొద్దని ముందే చెప్పిన. అయినా చీటికి మాటికి వస్తున్నది’ అని అన్నారు. ఆ మాటలంటుండగానే ఆయన కండ్లలోంచి నీళ్లు సుడులు తిరిగాయి. నిమ్స్‌లో చోటు చేసుకొన్న ఈ భావోద్వేగ సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షిని నేను. ఆమరణ దీక్ష చేస్తున్న కేసీఆర్ పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకొందామని ఆసక్తితో పత్రిక విలేకరిగా కవిత వెంట ఆయన ఉన్న గదిలోకి వెళ్లినపుడు చోటుచేసుకొన్న సన్నివేశమిది. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చావోరేవో అని అన్న కేసీఆర్, ఆమరణ నిరాహార దీక్షలో ఎంతటి తెగింపు, పట్టుదల, చిత్తశుద్ధిని ప్రదర్శించారో చూసిన ప్రత్యక్ష సాక్షిని.