నస్రుల్లాబాద్, జూలై 6 : భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. బీర్కూర్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే పాఠశాలలో 498 మంది విద్యార్థులు ఉన్నారు. ఆదివారం రాత్రి భోజనం కాసేపటికే 12 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కాగా 108 వాహనంలో బాన్సువాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
సోమవారం మరో ఐదుగురిని అడ్మిట్ చేశారు. 16 మంది పరిస్థితి నిలకడగా ఉండటంతో డిశ్చార్జి చేసినట్లు డాక్టర్ శ్రీలేఖ తెలిపారు. ఒక విద్యార్థి చికిత్స పొందుతున్నారని చెప్పారు. పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఆర్సీవో సత్యనాథ్‌రెడ్డి, తహసీల్దార్ సవాయిసింగ్, ఎంపీటీడీ శ్రీనిధి పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. బీఆర్ఎస్ స్థానిక నాయకులు దవాఖానకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.