హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత.. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ రాష్ట్రం గురించి పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు విదేశీ జర్నలిస్టులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు సెంట్రల్ ఆసియా ప్రాంతంలోని అమెరికా, జార్జియా, కజకిస్తాన్, కిర్గీస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్, న్యూస్ ఏజెన్సీకు చెందిన 21 మంది మీడియా ప్రతినిధుల బృందం ఈనెల 14 నుంచి 17వరకు రాష్ట్రంలో పర్యటించనున్నది.
రాష్ట్రంలోని పలు వాణిజ్య, ఆధ్యాత్మిక, ఐటీ, పర్యాటక ప్రాంతాలను ఈ ఏడు దేశాల మీడియా బృందం సందర్శించనున్నది. కాగా, ఆదివారం ఈ బృందం శిల్పారామాన్ని సందర్శించింది. ఆయా దేశాలతో వాణిజ్య, విద్య, సాంస్కృతిక సంబంధాలను దృఢ పరిచేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేస్తున్న కృషిలో భాగంగా ఈ విదేశీ మీడియా బృందం తెలంగాణలో పర్యటిస్తున్నట్టు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు.