కొత్తగూడెం ప్రగతి మైదాన్, జనవరి 17: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారీ కాంకేర్ అడవుల్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 16కి చేరింది. బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాల డీఆర్జీ జవాన్లతోపాటు కోబ్రా, సీఆర్పీఎఫ్కు చెందిన సుమారు 1,500 మంది బలగాల సంయుక్త ఆధ్వర్యంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
దీంతో మావోయిస్టులు తలపెట్టిన భారీ ప్లీనరీ భగ్నమైనట్లు తెలుస్తున్నది. మృతిచెందిన వారిలో సోంబేడి అలియాస్ సోమిడి(ఏసీఎం డిప్యూటీ కమాండర్), కిశోర్(ఏసీఎం), లాలు(పార్టీ సభ్యుడు), సోని(ఏసీఎం), మున్న, హిదుమా అలియాస్ ఇడుమ అలియాస్ ఇర్మ, సాంట అలియాస్ శ్వేత, గంగి(ఏసీఎం), కోవాసి, రత్న, కుసబ అలియాస్ కేశవ, అండాలు(పార్టీ సభ్యురాలు), దవాజ అలియాస్ రజిత(పార్టీ సభ్యురాలు), శాంతి(పార్టీ సభ్యురాలు), మైను అలియాస్ సాంబు, రాములు అలియాస్ రామలు(పార్టీ సభ్యుడు) ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.