చార్మినార్, జూలై 30: చారిత్రక చార్మినార్ కట్టడం మరోసారి ప్రజల మనోఫలకం పైకి చేరింది. స్థానికులతోపాటు పర్యాటకులకు సైతం సమయాన్ని చూపిస్తూ.. ముచ్చటగొలిపే గోడ గడియారం స్వల్పంగా ధ్వంసమైంది. చార్మినార్ కట్టడానికి తూర్పు దిక్కున నెలకొల్పిన గడియారం సోమవారం మధ్యాహ్నం స్వల్పంగా ధ్వంసమైనట్లుగా సిబ్బంది గుర్తించారు.
135 ఏండ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ గడియారానికి ప్రతి 24 గంటలకు ఒకసారి కీ ఇవ్వాల్సి ఉంటుంది. చార్మినార్ సమీపంలోని చౌక్ మార్గంలో వాచ్ రిపేర్ చేసే మధు ఈ గడియారానికి కీ ఇస్తుంటాడు. సోమవారం ఉదయం సైతం మధు గడియారానికి కీ ఇచ్చి వెళ్లాడు.
అనంతరం చార్మినార్కు కెమికల్ ట్రీట్మెంట్ చేసేందుకు వీలుగా స్టాండ్ వేయడానికి కాంట్రాక్ట్ సిబ్బంది కర్రలను పైకి చేరుస్తున్నారు. ఆ సిబ్బంది గడియారం ధ్వంసమైన విషయాన్ని గుర్తించి, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. మంగళవారం చార్మినార్ కన్జర్వేటర్ రాజేశ్వరితోపాటు మరో ఉన్నతాధికారి గడియారాన్ని పరిశీలించారు. ఆ తర్వాత గడియారాన్ని మధుతో బాగుచేయించారు. గడియారం ఎలా ధ్వంసం అయ్యిందనే అంశంపై విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు.