హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు మరోసారి చాపకింద నీరులా పెరుగుతున్నాయి. ఉత్తరాదితోపాటు దక్షిణాన కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలో కూడా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికితోడు అక్కడక్కడా మరణాలు సైతం నమోదు కావటం ఆందోళన కలిగిస్తున్నది. పొరుగు రాష్ర్టాల నుంచి తెలంగాణకు వైరస్ విస్తరించే ముప్పు లేకపోలేదన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7,154 కేసులు నమోదయ్యాయి. కేరళలో 2,165, ఢిల్లీలో 731, మహారాష్ట్రలో 615, కర్ణాటకలో 467, గుజరాత్లో 1,281, తమిళనాడులో 231, ఏపీలో 103, తెలంగాణలో 12 కేసులు నమోదైనట్టు తెలుస్తున్నది.
ఎలాంటి వైరసైనా నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రమవుతుంది. కరోనా కూడా అంతే. ప్రస్తుతం విస్తరిస్తున్న వైరస్ వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో అక్కడక్కడా కేసులు నమోదువున్నప్పటికీ వాటిల్లో తీవ్రత మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం విస్తరిస్తున్న వైరస్ వేరియంట్లో వ్యాప్తి రేటు అధికంగా ఉండవచ్చు కానీ దానికి తీవ్ర ప్రభావం చూపే స్వభావం మాత్రం లేదు. స్వల్ప లక్షణాలే ఉండటం వల్ల హాస్పిటల్ అడ్మిషన్స్ ఉండే అవకాశం లేదు. అందుకని ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావల్సిన అవసరం లేదు కాని అప్రమత్తంగా మాత్రం ఉండాల్సిన అవశక్యత ఉంది.
– డాక్టర్ రవీందర్‌నాయక్, ప్రజా వైద్యం డైరెక్టర్