హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీఎఫ్), ప్రత్యేక అభివృద్ధి నిధులతో (ఎస్డీఎఫ్) చేపట్టిన పనులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీడీఎఫ్, ఎస్డీఎఫ్ పనులపై దృష్టిపెట్టింది. ఆయా పనులు, పథకాలను నిలిపివేయాలని గత నెల 10న కలెక్టర్లను ఆదేశించింది. పనులు, పథకాలు ఏ దశలో ఉన్నాయో సమగ్ర వివరాలు సేకరించాలని సూచించింది. పనులు ప్రారంభం అయ్యాయా? ప్రారంభమైతే ఎంత శాతం పూర్తయ్యాయి? ఎంత మేర బిల్లులు చెల్లించారు? వంటి సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని ఆదేశించింది. ఈ మేరకు శాఖల వారీగా అధికారులు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ పనుల విలువ రూ.10 వేల కోట్లకుపైగా ఉన్నట్టు సమాచారం.
ఇందులో అత్యధికంగా పనులు ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు తమ నివేదికల్లో తెలిపారు. దీంతో వీటిపై ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇటీవల సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. ఈ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఇప్పటికే ప్రారంభమైన పనులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగించవద్దని స్పష్టం చేసినట్టు సమాచారం. వీటితోపాటు ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకు సైతం మెజార్టీ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్టు తెలిసింది. కొత్త ఆర్థిక సంవత్సరం వరకు పెండింగ్ బిల్లుల ఊసెత్తవద్దని కాంట్రాక్టర్లకు అధికారులు తెలిపినట్టు సమాచారం. ఫలితంగా ఆయా పనులు కూడా దాదాపు ఆగిపోయాయి. కొన్ని ప్రాజెక్టుల్లో తూతూమంత్రంగా పనులు కొనసాగుతున్నాయి.
సీడీఎఫ్, ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన పనులు, పథకాల్లో ప్రారంభం కాని పనులను పూర్తిగా రద్దు చేయనున్నట్టు సమాచారం. తద్వారా వేల పనులు ప్రారంభం కాకముందే రద్దు కానున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఒక్క పంచాయితీరాజ్శాఖలోనే 2,800 పనులు మంజూరైనా, ప్రారంభం కాలేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. వీటి విలువ రూ.2,100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ పనులన్నీ రద్దు అవుతాయని చెప్తున్నారు. వీటితోపాటు మున్సిపల్, రోడ్లు, భవనాలు, నీటిపారుదల.. ఇలా అనేక శాఖల పరిధిలో చేపట్టిన వేల పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుందని సమాచారం. దీంతో ప్రజల ఏండ్ల పోరాటం తర్వాత మంజూరైన పనులు మొదలు కాకముందే కాలగర్భంలో కలిసిపోనున్నాయి. కొన్ని పనులు ప్రారంభమై 10 శాతం వరకు పూర్తయిన వాటిపైనా అధికారులు సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిసింది. వాటిని రద్దు చేస్తే ఎంతమేర నష్టం కలుగుతుందో అంచనా వేసి, నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 4.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు సమాచారం. ఈ పనుల విలువ సుమారు రూ.4,430 కోట్లు. ప్రాజెక్టు వ్యయంలో నాబార్డు 80 శాతం నిధులను రుణాల రూపంలో సమకూర్చనుండగా, 20 శాతం నిధులను ప్రభుత్వం వెచ్చించనున్నది. సంగమేశ్వర పథకం కింద సింగూరు జలాశయం కుడి వైపు నుంచి 12 టీఎంసీల నీటిని ఎత్తిపోసి జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని, బసవేశ్వర పథకం కింద సింగూరు జలాశయం ఎడమవైపు నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నారాయణ్‌ఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రతిపాదించారు. భూ సేకరణకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడీ పథకాలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.