బ్రసెల్స్: రష్యాకు ఉత్తర కొరియా 10,000 మంది సైనికులను పంపించిందని అమెరికాలోని పెంటగాన్ అధికార ప్రతినిధి సబ్రిన సింగ్ సోమవారం చెప్పారు. రష్యాలోని కుర్స్క్ రీజియన్‌లో ఉక్రెయిన్ దళాలపై జరుగుతున్న యుద్ధంలో నేరుగా కానీ, సహాయకారులుగా కానీ వీరిని రష్యా వినియోగించుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సైనిక శిక్షణ ఇవ్వడానికి కూడా వీరిలో కొందరిని ఉపయోగించే అవకాశం ఉందన్నారు. కొందరు సైనికులు ఇప్పటికే ఉక్రెయిన్ సమీపానికి చేరుకున్నారని చెప్పారు. ఉత్తర కొరియా సైనికులను యుద్ధంలో ఉపయోగించుకోవడం అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని తాము ఇప్పటికే బహిరంగంగా హెచ్చరించామన్నారు.
మళ్లీ బ్యాలెట్ పేపర్ తీసుకురావాలి: ట్రంప్
న్యూయార్క్: ఎన్నికలు నిజాయితీగా జరగాలంటే.. అది పేపర్ బ్యాలెట్‌తోనే సాధ్యమవుతుందని, పేపర్ బ్యాలెట్‌ను తిరిగి తీసుకురావాలని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. 2020 అధ్యక్ష ఎన్నికలు మోసపూరితమైనవిగా పేర్కొన్నారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ఓటింగ్ విధానాన్ని ట్రంప్ విమర్శించారు. పేపర్ బ్యాలెట్ తీసుకురాకపోతే, ఎన్నికల్లో నిజాయితీని నిర్ధారించలేమన్నారు. 2024 ఎన్నికలు.. తనకు చివరి ఎన్నికలుగా పేర్కొన్నారు.