న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: క్రమంగా పెరుగుతూ వచ్చిన మొబైల్ సబ్‌స్ర్కైబర్లు..గతేడాది చివరి నెలలో మాత్రం భారీగా తగ్గారు. డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు 1.28 కోట్ల మంది తగ్గినట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. దీంతో మొత్తం మొబైల్ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 115.46 కోట్లకు తగ్గారు. అంతకుముందు నెలలో 116.74 కోట్లుగా ఉన్నారు. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్న సంస్థకు డిసెంబర్ నెల గట్టి షాకిచ్చింది. జియో నెట్‌వర్క్‌కు 1.29 కోట్ల మంది గుడ్‌బై పలికారు.
ఒక్క నెలలో ఇంతమందిని కోల్పోవడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 41.57 కోట్లకు పడిపోయింది. అలాగే వొడాఫోన్ ఐడియా 16.14 లక్షల మందిని కోల్పోవడంతో మొత్తం సంఖ్య 26.55 కోట్లకు పరిమితమైంది. అలాగే ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లోకి కొత్తగా 4.75 లక్షల మంది జతవడంతో మొత్తం సంఖ్య 35.57 కోట్లకు చేరుకున్నారు.