హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ‘వ్యవసాయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక ఆసక్తికర ఉదాహరణ’ ప్రముఖ పాలసీ రిసెర్చర్ హరీశ్ దామోదరన్ ఒక అంతర్జాతీయ సదస్సులో చెప్పిన మాటలివి. ఏడేండ్ల క్రితం వరకు ఏమాత్రం ఆశలు లేని తెలంగాణ.. ఎత్తు గడ్డకు నీళ్లు వస్తాయన్న నమ్మకమే లేని తెలంగాణ.. కరెంటు వస్తదని కల కూడా కనలేని తెలంగాణ.. ఎరువులకు, విత్తనాలకు, పెట్టుబడికి.. కనాకష్టం పడ్డ తెలంగాణ ఇవాళ ధాన్యం పండించడంలో దేశంలోనే రెండోస్థానంలో ఉన్నదని జాతీయ అంతర్జాతీయ వ్యవసాయ నిపుణులు, ఆర్థిక వేత్తలు కొనియాడుతున్నారు. అమెరికాకు చెందిన ‘వాట్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్’ సంస్థ శుక్రవారం ‘సాగు విప్లవాల తర్వాత భారత వ్యవసాయరంగం’ అనే అంశంపై జూమ్ ద్వారా ఆన్లైన్ సదస్సు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలో జరిగిన ఈ చర్చలో జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ, ఆర్థిక రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో వ్యవసాయ రంగం గురించి ప్రముఖ పాలసీ రిసెర్చర్ హరీశ్ దామోదరన్ ప్రత్యేకంగా ప్రస్తావించి కొనియాడారు. ‘వ్యవసాయరంగానికి సంబంధించి తెలంగాణ ఒక ఆసక్తికర ఉదాహరణ’ అని ప్రశంసించారు. రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును, 46 వేల చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయను చేపట్టిందని వివరించారు. ఈ రెండు పథకాల ద్వారా సాగునీటి లభ్యత, సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగాయని సభకు హాజరైన నిపుణులకు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశాలన్నింటినీ.. ఆ రాష్ట్ర రైతులు అందిపుచ్చుకొన్నారని, విస్తారంగా పంటలు వేశారని తెలిపారు. దీని ఫలితంగా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు వరి సాగులో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని హరీశ్ దామోదరన్ చెప్పారు. పత్తి ఉత్పత్తిలోనైతే దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉన్నదని కొనియాడారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆలోచన, ఆచరణ రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖచిత్రాన్నే మార్చేసిందని నిపుణుల వ్యాఖ్యలు మరోసారి రుజువుచేశాయి. సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ వ్యవసాయరంగ నిపుణులు సైతం తెలంగాణపై ప్రశంసలు కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒకప్పటి బీడు భూములు ఇప్పుడు సస్యశ్యామలం అయ్యాయని కొనియాడారు. ఈ సదస్సులో ప్రముఖ వ్యవసాయ, ఆర్థిక రంగ నిపుణులు సౌమిత్ర ఛటర్జీ, ఆండ్రూ ఫాస్టర్, అశోక్ గులాఠీ, మేకల కృష్ణమూర్తి, యోగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.