నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు తగ్గిపోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న సమయంలోనే డెంగీ జ్వరం భయపెడుతున్నది. డెంగీ అనగానే జనం జంకుతున్నారు. ప్రత్యేకమైన చికిత్స లేకపోవడంతో ఒకరికి డెంగీ వస్తే ఇంటిల్లిపాదికీ జ్వరం వచ్చినంత పని అవుతున్నది. అయితే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించి అవగాహన పెంచుకుంటే డెంగీ జ్వరం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ దవాఖానలో నలుగురు డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ చెప్పారు. అప్రమత్తమైన అధికార యంత్రాగం డెంగీ కేసులు నమోదవుతుండడంతో జిల్లా అధికార యంత్రాంగంతోపాటు వైద్య శాఖ అప్రమత్తమయ్యింది. జిల్లావ్యాప్తంగా వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. నీటికుంటలు, మురికికుంటలు ఉన్నచోట ఆయిల్‌బాల్స్ వేసి డెంగీ లార్వాను చంపుతున్నారు. ఇంటి పరిసరాల్లో చెడిపోయిన కూలర్లు, నీటి తొట్టీలు, డ్రమ్ములను శుభ్రం చేయాలని సూచిస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ మరో వైరల్ వ్యాధి ప్రజలను వణికిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో డెంగీ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వైరల్ జ్వరాల వ్యాప్తికి అనువైన వాతావరణం ఉండడంతో డెంగీ విజృంభిస్తున్నది. తీవ్రమైన వ్యాధిగా మారుతూ ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నది.
ఖలీల్‌వాడి, నవంబర్ 17
వ్యాధి వ్యాప్తి విధానం..
ఆర్బో వైరస్ అనే అత్యంత సూక్ష్మమైన వైరస్‌తో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ఒక డెంగీ రోగి నుంచి మరొక ఆరోగ్యవంతమైన మనిషికి దోమతో వ్యాపిస్తుంది. ఈ డెంగీ సంక్రమణ దోమ లు పగటి పూట కాటువేస్తాయి. ఈ రకం దోమలు ఇండ్ల ల్లో నిల్వ ఉంచిన మంచినీటిపై, ఎయిర్కూలర్లలో ఉండే నీటిపై, ఫ్రిజ్ వెనుక భాగాన నిల్వ ఉండే నీటిపై, నీటి తొట్టిల్లో, పూలకుండీలు, ఫౌం టేన్ల, ఖాళీడ్రమ్ములు, సన్‌షేడ్స్, కొబ్బరిచిప్పలు, ఫ్లవర్వాజ్ల్లో, చెట్టుతొర్రలు, పగిలిన సీసాల్లో ఈ దోమలు వృద్ధి చెందుతాయి.
వ్యాధి లక్షణాలు
చికిత్స
డెంగీ అనేది విషజ్వరం. ఈ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీలేదు. ముఖ్యంగా ఈ విషజ్వరం రాకుండా జాగ్రత్తలను పాటించి, వాటి బారిన పడకుండా చూసుకోవాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ జ్వరంతో బాధపడుతున్న వారికి వాంతులు, జ్వరం తీవ్రత, దురద తగ్గించడానికి కావాల్సిన మందులను వైద్యులు ఇస్తారు. ఇదే తరహాలో శరీరంలో జీవద్రవం తగ్గకుండా స్లైన్లను కావాల్సినంతగా ఎక్కిస్తారు. స్లైన్లు ఇవ్వడంతో శరీరంలోని జీవద్రవం తగ్గకుండా ఉండడమే కాకుండా ప్లేట్లెట్ల సంఖ్య తగ్గకుండా అరికడుతుంది.
ఆందోళన చెందొద్దు..
డెంగీపై అవగాహన అవసరం. డెంగీతోపాటు ఇతర విషజ్వరాలు ప్రబలడానికి దోమలే కారణం. దోమల నివారణపై శ్రద్ధ పెడితే విషజ్వరాల నుంచి కాపాడుకోవచ్చు. డెంగీ వస్తే ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గుతుంది. 30వేల వరకు తగ్గినా భయపడాల్సిన అవసరం లేదు. అంతకన్నా తగ్గితే రోగికి ప్లేట్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ సొసైటీలో, ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్లేట్లెట్స్ అందుబాటులో ఉన్నాయి.
పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం..
డెంగీ ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇంటింటికీ తిరుగుతూ వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించినా ప్రజల నిర్లక్ష్యంతోనే కేసులు పెరుగుతున్నాయి. పరిశుభ్రత తప్పకుండా పాటించాల్సిందే. ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు.