న్యూఢిల్లీ/బెంగళూరు, ఏప్రిల్ 13: ప్రముఖ మొబై ల్ ఫోన్ల తయారీ సంస్థ, చైనాకు చెందిన షియామీ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు మను కుమార్ జైన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట బుధవారం హాజరయ్యారు. విదేశీ మారకపు నిర్వహణ చట్టం (ఫెమా) కింద జైన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఆరోపణలపై విచారణలో భాగంగా ప్రశ్నించేందుకే ఈ సమన్లు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే జైన్‌ను బెంగళూరులోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారించగా, షియామీ ఇండియా కార్యకలాపాల గురించి ఆరా తీశారు. జైన్ వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్టు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, గడిచిన కొన్నేండ్లుగా కోట్లాది రూపాయల్లో జరిగిన విదేశీ రెమిటెన్సులకు సంబంధించి షియామీ, దాని ఉద్యోగులను విచారిస్తున్నట్టు ఈడీ చెప్తున్నది. ఈ క్రమంలోనే గతంలో షియామీ ఇండియా అధిపతిగా ఉన్న జైన్‌ను పలు కీలక ఆర్థికపరమైన డాక్యుమెంట్లను అందజేయాలని కోరింది. ఆయన ఆధ్వర్యంలో జరిగిన వ్యాపార ఒప్పందాలు, చెల్లింపులు తదితర వివరాలను ఈ విచారణ సందర్భంగా ఈడీ అడిగింది. మరోవైపు జైన్‌కు ఈడీ నోటీసులపై స్పందిస్తూ తమ సంస్థ భారతీయ చట్టాలకు లోబడే పనిచేస్తున్నదని షియామీ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణకు పూర్తిగా సహకరిస్తామనీ తెలిపారు. కాగా, నిరుడు డిసెంబర్లో పన్ను ఎగవేత అనుమానాలతో షియామీ, మరికొన్ని చైనా మొబైల్ తయారీ సంస్థల్లో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే భద్రతాపరమైన కారణాలతో షియామీకి చెందిన కొన్ని స్మార్ట్‌ఫోన్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతీ విదితమే.