ఇబ్రహీంపట్నం, నవంబర్ 17 : రంగారెడ్డి జిల్లాలో రైతులు వరి సాగులో భాగంగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లను వాడుతున్నారు. రెండు సీజన్లలో పొలాలను సిద్ధం చేస్తారు. దుక్కులు దున్నడం, వరినాట్లు వేయడం, కట్టలు వేయడం వంటి వాటికి ట్రాక్టర్లు అవసరమవుతాయి. పంట కోతకు వచ్చిన తర్వాత హార్వెస్టర్లతో కోయిస్తారు. వడ్లను ట్రాక్టర్లలో మార్కెట్‌కు తీసుకెళ్తారు. డీజిల్, డ్రైవర్, ఇతర ఖర్చుల ఆధారంగా యజమానులు ధరలు నిర్ణయిస్తున్నారు. ఏడాదిగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు రైతుల పాలిట శాపంగా మారాయి. కిరాయిలు బాగా పెరిగి రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒక్కోసారి పెట్టుబడులూ రాక నష్టపోవాల్సి వస్తున్నది.
ఖర్చు తడిసి మోపెడు..
కూలీల కొరతను అధిగమించి యంత్రాలతో వ్యవసాయ పనులు చేసుకోవడం రైతులకు ప్రయోజనకరంగా మారింది. ట్రాక్టర్లు, టిల్లర్లు, వరికోతయంత్రాలు, బ్లేడ్ ట్రాక్టర్లు పెద్ద ఎత్తున ఉంటాయి. వీటితో పాటు పురుగుల మందులు పిచికారీ చేయడానికి ఉపయోగించే తైవాన్, పవర్ స్ప్రేయర్లు ఉంటాయి. పెరిగిన డీజిల్ ధరల కారణంగా వీటి ఖర్చులు మోపెడవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎకరాకు అదనంగా ఖర్చులు..
జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగడంతో వ్యవసాయ యంత్రాల యజమానులు ధరలు పెంచారు. ట్రాక్టర్‌తో పొలం దున్నడానికి గంటకు రూ.వెయ్యికి పైనే ఖర్చవుతున్నది. వరికోత యంత్రాలకు గంటకు రూ.2000 నుంచి 3000 మధ్యన తీసుకుంటున్నారు. ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించేందుకు ట్రాక్టర్ కిరాయి కావాల్సి వస్తున్నది. డీజిల్ రేట్లు పెరుగడం వల్ల రైతులపై కూడా తీవ్ర ప్రభావం పడుతున్నది.
పంట మారిస్తేనే లాభాలు..
ఆరుతడి పంటలతో పాటు ఆకుకూరలు సాగు చేస్తున్నా. పంట మార్పితోనే అధిక లాభాలు పొందవచ్చు. ప్రభుత్వం, అధికారుల సూచనల మేరకు వరికి బదులు కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసి నగరానికి తరలిస్తా. భూ సారం ఉండాలంటే పంట మార్పిడి తప్పనిసరి. ప్రతి రైతు ఆరుతడి పంటలు సాగు చేయాలి.
పంటల ధరలు పెంచాలి..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆరేండ్లలోనే పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచింది. 2014లో రూ.75 ఉన్న పెట్రోల్ రూ.110, రూ.65 ఉన్న డీజిల్ రూ.105కు పెంచింది. అదే రైతులు పండించిన పంటలకు మాత్రం ధర పెంచలేదు. కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతున్నది.
ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి..
ఆరుతడి పంటలైన కూరగాయలు, ఆకుకూరలతో పాటు జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, మినుములు, కందులు, బొబ్బర్లు, వేరుశనగతో పాటు నూనెగింజల పంటలపై దృష్టి సారించాలి. ఆరుతడి పంటలతో రైతులు అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందవచ్చు.