
తీగజాతి పంటలు లాభాలు కురిపిస్తున్నాయి. బీర, బెండ, సోర, కాకర వంటి పంటలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు ఇస్తున్నాయి. వరి కంటే తక్కువ సమయంలో పంట చేతికి వస్తుండడంతో రైతులు ఇలా ఎక్కువ ఆదాయాన్నిచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులేస్తున్నారు. ఎప్పటికీ ఒకే రకం కాకుండా తీరొక్క రకాలు సాగుచేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటున్నారు. అంతేగాక పంటల మార్పిడితో భూమికి సారం చేకూరడంతో పాటు దిగుబడులు పెరిగి రైతుకు ఆశించిన ధర దక్కుతున్నది. అందుకే తీగజాతి పంటలు పండిస్తూ తోట వద్దే అమ్ముకుంటుకున్నారు.
శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన సీహెచ్.తిరుపతిరెడ్డి తనకున్న భూమిలో తీరొక్క పంటలు సాగుచేస్తున్నాడు. వాణిజ్య పంటలతో పాటు తీగజాతి రకాలు వేసి మంచి ఆదాయం పొందుతున్నాడు. ఎప్పటికీ ఒకే పంట వేయకుండా మార్చుతున్నాడు. పసుపు, మక్కజొన్న, తీగ తోటలతో పాటు కొంత వరి వేశాడు. రెండు గుంటల్లో సోరకాయ తోట పెట్టాడు. రూ.వెయ్యితో విత్తనాలు తెచ్చి నాటి.. తోటకు నిత్యం నీళ్లు పెడుతూ ఒకటి, రెండు సార్లు మందులు పిచికారీ చేశాడు. నెల తర్వాత సోరకాయలు విరగ్గాశాయి. ఇంకేముంది తోట వద్దే అమ్మడం ప్రారంభించగా, కొందరు వ్యాపారులు తోట వద్దకే వచ్చి తీసుకెళ్తున్నారు. అంతేగాక వ్యాపారులతో పాటు మార్కెట్లో విక్రయిస్తున్నాడు. ఒక్కో కాయను రూ.10 నుంచి రూ.15 వరకు అమ్ముతున్నాడు. మార్కెట్లో ఒక్కో కాయ రూ.20 పలుకుతున్నది. ఈ క్రమంలో రోజుకు 30 నుంచి 50 కాయలు అమ్ముతున్నాడు. ఇలా సోరకాయ తోటపై రూ.7వేల నుంచి రూ.10వేల దాకా ఆదాయం వస్తున్నదని తిరుపతిరెడ్డి చెప్పాడు. ఇంతకుముందు బీర తోటను పండించినట్లు రైతు తెలిపాడు. తీగజాతి పంటలతో మంచి లాభాలున్నట్లు పేర్కొంటున్నాడు. ఈ పంటలతో మంచి ఆదాయం వస్తున్నట్లు చెప్పారు. అలాగే పెద్దకోడెపాక, గోవిందాపూర్ గ్రామాల్లోనూ తీగ జాతి పంటలతో పాటు మిర్చి, పసుపు, పత్తి పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. కేవలం వరి కాకుండా తీరొక్క పంటలను సాగు చేయాలనే ఆలోచన.. రైతులను లాభాల బాటలో నడిపిస్తున్నది.