వెంగళరావునగర్, మార్చి 25: నియోజవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం వెంగళరావునగర్ డివిజన్లోని కల్యాణ్ నగర్ వెంచర్-1 పార్క్‌లో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాలనీవాసులకు ఆహ్లాదం, ఆరోగ్యం కోసం తమ ప్రభుత్వం లక్షలు వెచ్చించి పార్కులను సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. నియోజవర్గంలోని అనేక పార్కులను అభివృద్ధి చేశామన్నారు. త్వరితగతిన పార్కును సుందరంగా తీర్చిదిద్ది కల్యాణ్ నగర్ కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్పొరేటర్ దేదీప్య, జీహెచ్ఎంసీ ఈఈ రాజ్ కుమార్, నాయకులు వేణు, శ్యామ్ ముదిరాజ్, చిన్న రమేశ్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్,మార్చి25: మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. శుక్రవారం యూసుఫ్‌గూడ డివిజన్ హైలం కాలనీలో రూ.14.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపడుతున్నామన్నారు. డివిజన్ అధ్యక్షుడు సంతోష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌దాస్, నాయకులు వెంకటేశ్, గీతా గౌడ్, అరుణ, స్రవంతి, అజర్ తదితరులు పాల్గొన్నారు.