రామగిరి, మార్చి 15 : ఇంటర్మీడియట్ పరీక్షలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ ద్వితీయ లాంగ్వేజి (తెలుగు, ఉర్దూ, అరబిక్, సంస్కృతం, హిందీ) పరీక్షలకు 111 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా రెగ్యూలర్, ఓకేషనల్ విభాగంలో 34,126 మందికి గాను 31,827 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,299 మంది గైర్హాజరయ్యారు. నిమిషం నిబంధనతో నల్లగొండ జిల్లా కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో పరీక్ష కేంద్రంలోని అధికారులు అనుమతించలేదు. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయా జిల్లాల కలెక్టర్లు టి.వినయ్కృష్ణారెడ్డి, వెంకట్రావ్ తనిఖీ చేసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
విద్యార్థుల హాజరు ఇలా..
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తొలిరోజు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు రెగ్యూలర్, ఓకేషనల్ విభాగంలో 34,126 మందికి గాను 31,827 మంది హాజరు కాగా 2,299 మంది గైర్హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విభాగంలో 30,109 మందికి 28,441 మంది హాజరు కాగా 1,668 గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్లో 4,017 మందికి గాను 3,386 మంది హాజరు కాగా 631 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను ఆయా ప్రాంతాల్లో డీఐఈఓతో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్యాడ్ బృందాలు తనిఖీలు చేశారు.
కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని ఆయా నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట డీఐఈఓ దస్రూనాయక్ ఉన్నారు. అలాగే సూర్యా పేట జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వెంకట్రావ్, డీఐఈఓ జానపాటి కృష్ణయ్య పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ంతో పాటు పలు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను డీఐఈఓ రమణి తనిఖీ చేశారు.