నాగర్‌కర్నూల్ జిల్లాలో సర్కారు వైద్యం సామాన్యులకు మరింత చేరువ కానున్నది. ప్రభుత్వం వ్యవసాయంతో పాటు విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేసింది. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాకు మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరయ్యాయి. తాజాగా జిల్లా దవాఖానలో డయాగ్నొస్టిక్, వైరాలజీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లా ప్రజలకు ఇక కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందనున్నాయి.
నాగర్‌కర్నూల్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ జిల్లా వ్యవసాయంలో ఎంతో ప్రగతి సాధించింది. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ఈ ప్రాంతం వలసలకు నిలయంగా.., సంక్షేమానికి దూరంగా ఉండిపోయింది. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వరాష్ట్రం సాధించాక జిల్లాగా ఆవిర్భవించింది. ఈ క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికావడంతో వ్యవసాయ రంగంలో రాష్ట్రంలోనే మొదటి వరుసలో నిలుస్తున్నది. ఇదిలా ఉండగా, తాజాగా వైద్య సేవల్లోనూ నాగర్‌కర్నూల్‌కు భవిష్యత్‌లో మంచి రోజులు రానున్నాయి. సీఎం కేసీఆర్ మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరు చేశారు. ఉయ్యాలవాడ శివారులో ప్రస్తుతం నర్సింగ్ కళాశాల పనులు జరుగుతున్నాయి. ఇక పట్టణంలోని ఏరియా దవాఖానను 300 పడకలుగా అప్‌గ్రేడ్ చేసే పనులు ప్రారంభమయ్యాయి. ఆక్సిజన్ ప్లాంట్ సైతం అందుబాటులోకి రానున్నది. తాజాగా డయాగ్నొస్టిక్ కేంద్రం, వైరాలజీ ల్యాబ్‌లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా వైద్య రంగంలో గతంలో లేని విధంగా పలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. డయాగ్నొస్టిక్ కేంద్రం ఏర్పాటుకు బస్ డిపో సమీపంలో స్థల సేకరణ పూర్తయింది. ఆరు నెలల్లోగా పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దవాఖానలకు వెళ్లే రోగులకు తప్పనిసరిగా పరీక్షలు చేయించాల్సి వస్తున్నది. మారిన పరిస్థితులతో బీపీ, షుగర్ వంటి వ్యాధులు సాధారణంగా మారాయి. ప్రతి నెలా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. అలాగే డెంగీ, మలేరియా వంటి జ్వరాలు, ఇతర అనారోగ్యాలు వస్తే రక్తం, మూత్ర పరీక్షలు అవసరమవుతాయి. గుండె, ఎముకలు, కిడ్నీ, థైరాయిడ్ వంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. చికిత్స, మందులకంటే పరీక్షలకే 70 శాతం ఖర్చు అవుతున్నది. దీంతో చాలా మంది పేదలు ఆర్ఎంపీలను సంప్రదించి మందు గోలీలతో సరిపెట్టుకుంటున్నారు. దీంతో రోగం ముదిరి ప్రాణాల మీదకు వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న డయాగ్నొస్టిక్ కేంద్రాలతో ఈసీజీ, టూడీ ఈకో, అల్ట్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే సేవలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఈ కేంద్రం ద్వారా ఒకట్రెండు రోజుల్లోనే వ్యాధి నిర్ధారణ అవుతుంది. అత్యంత ఖరీదైన యంత్రాలతో గంటకు 400 నుంచి 800 రిపోర్టులు వస్తాయి. గాంధీ, నిమ్స్ వంటి దవాఖానల్లో ఉండే సదుపాయాలు ఇక్కడే అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల భవిష్యత్‌లో పేదలకు ఉచితంగానే అతి త్వరగా 50కి పైగా వ్యాధి నిర్ధారణ చికిత్సలు అందే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వైద్య రంగంలో జరుగుతున్న పురోభివృద్ధిపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పేదలకు కార్పొరేట్ వైద్యం..
జిల్లా ప్రజలకు ఏడాదిలోగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. మెడికల్, నర్సింగ్ కళాశాలల పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తవుతాయి. జిల్లా దవాఖాన 300 పడకలుగా అప్‌గ్రేడ్ కానున్నది. డయాగ్నోస్టిక్ కేంద్రంలో ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలు జరుగుతాయి. వైరాలజీ ల్యాబ్‌లో కూడా కొత్తగా వచ్చే వ్యాధులకు పరీక్షలు చేస్తాం. ఇకపై చికిత్సలు, పరీక్షల కోసం హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వ్యయం, దూరభారం తగ్గుతుంది.