vinayaka chavithi 2021 | నవరాత్రులు దగ్గరకు వచ్చేశాయి. పర్యావరణహితంగా, కరోనా రహితంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నారు. ఏటికేడు మట్టి విగ్రహాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండటంతో.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులు మట్టితో చేసిన విగ్రహాల ప్రతిష్ఠ అంతకంతకూ పెరుగుతూ వస్తున్నది. ప్రారంభంలో ఇండ్లల్లో మాత్రమే మట్టి వినాయకుల ఏర్పాటుకు ఆసక్తి చూపిన ప్రజలు క్రమంగా మండపాల్లో ప్రతిష్ఠించేందుకు కొంచెం పెద్ద సైజు మట్టి విగ్రహాలను ఎంపిక చేసుకుంటుండడం శుభపరిణామం. ఇక వినాయక చవితి దగ్గర పడుతుండటంతో విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇప్పటికే వినాయక ప్రతిమలను కొనుగోలు చేసిన ప్రజలు ముందస్తుగానే మండపాలకు తరలిస్తున్నారు.